|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:42 AM
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్యాలయం వద్ద యూరియా కొరతకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ సూళ్లూరుపేట సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నర్సింహారెడ్డి, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణిని కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఫోటోల రూపంలో చూపించి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, రైతుకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ఇప్పుడు యూరియా కూడా దొరకకపోవడం అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు. ఉచిత పంటల బీమా అటకెక్కించడంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధరలు లేకుండా చేసి, ఇప్పుడు యూరియాను కూడా లేకుండా చేస్తే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు.యూరియా కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఎక్కడా సమీక్షలు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అధికార పార్టీ నేతలు, ప్రైవేట్ డీలర్లతో కుమ్మక్కై రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.267.50 కాగా, మార్కెట్‌లో రైతులు బస్తాకు రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సజావుగా అందించడంతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించామని గుర్తు చేశారు. ఈ–క్రాప్ వ్యవస్థ ద్వారా ఉచిత పంటల బీమా అందించి రైతులకు భరోసా కల్పించామన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి దళారీలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు.
Latest News