|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:41 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది అని వైసీపీ నేతలు తెలిపారు. ఈ విషయంపై వారు స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.వైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది అని వైసీపీ నేతలు తెలిపారు.
Latest News