|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:39 AM
వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తేనే కేసులు పెట్టి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించిన పోలీసులు.. మహిళా ఉద్యోగిపై ఏడాదిన్నర పైగా అత్యాచారం చేస్తూ వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెలుగుచూసి 24 గంటలు గడిచినా కనీసం కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తప్పు చేసినట్టు ఆధారాలతో సహా దొరికిపోయినా ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పార్టీ నాయకులతో కమిటీ వేసిన పవన్ కళ్యాణ్‌కి.. రాష్ట్రంలో చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. బాధితురాలినే నిందితురాలిగా చేసే కుట్రలో భాగంగానే జనసేన నాయకులతో కమిటీ వేశారని ఆమె ఆరోపించారు. ఇటీవలే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వేధింపులపై ఒక మహిళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు పెట్టి వేధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని పోలీసులు అలా వదిలేస్తుండటంతోనే వాళ్లు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారని, పేకాట ఆడుతూ దొరికిపొయిన మంత్రి సంధ్యారాణి కొడుకుపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఎన్ని తప్పులు చేసినా వారిపై చర్యలు తీసుకోరా? వారికి చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతోపాటు స్పీకర్, మహిళా కమిషన్ స్పందించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
Latest News