|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:47 PM
భారత్ - న్యూజిలాండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో కివీస్ పుంజుకుంది. మొదటి మూడు టీ20ల్లో విఫలమైన కివీస్ ఓపెనర్లు విశాఖలో రెచ్చిపోయారు. టిమ్ సైఫర్ట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా, పవర్ ప్లే ముగిసే సమయానికి డెవాన్ కాన్వే ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడటంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 71 పరుగులు చేసింది. 8.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసిన న్యూజిలాండ్.. ఆ తర్వాత ఆ రేంజ్ స్కోర్ చేయలేకపోయింది. ఆఖర్లో పుంజుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. తొలి ఓవర్‌లో టిమ్ సైఫర్టీ క్యాచ్ మిస్సవడంతో, లైఫ్‌ని ఉపయోగించుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డెవాన్ కాన్వే కూడా బౌండరీల మోత మోగించాడు. 25 బంతుల్లో సైఫర్టీ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కాన్వే కూడా హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుటయ్యాడు.
కాన్వే అవుటైన తర్వాత వరుస వికెట్లు పడటంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. కాన్వే అవుటైన తర్వాత ఓవర్‌లోనే 4 బంతుల్లో 2 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బుమ్రాకి క్యాచ్ ఇచ్చి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసిన టిమ్ సైఫర్ట్ కూడా వికెట్ కోల్పోయాడు. గ్లెన్ ఫిలిప్స్ (24 పరుగులు) సిక్సర్ బాదే ప్రయత్నం చేయగా రింకూ సింగ్ బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు.
మిడిల్ ఓవర్లలో కివీస్ బ్యాటర్లు విఫలమయినప్పటికీ ఆఖర్లో పుంజుకున్నారు. వరుస వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. డారిల్ మిచెల్ ఆఖర్లో 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఆరంభంలో పరుగులు ఇచ్చినప్పటికీ.. పవర్ ప్లే తర్వాత లైన్ మార్చి బౌలింగ్ చేసి పరుగులను కంట్రోల్ చేశారు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకి ఒక వికెట్ దక్కగా, హర్షిత్ రాణా వికెట్లేమీ తీసుకోకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు.
Latest News