వైజాగ్‌లో జీరోలైన టీమిండియా హీరోలు.. కివీస్‌కు తొలి విజయం
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:46 PM

భారత్ - న్యూజిలాండ్ మధ్య వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమిపాలయింది. మొదటి మూడు టీ20ల్లో వన్ సైడెడ్ విక్టరీ సాధించిన భారత జట్టు.. విశాఖలో చతికిలపడింది. టీమిండియాలో ఆశలు రేపిన శివమ్ దుబే దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అందించిన భారీ లక్ష్య ఛేదనలో భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో తొలి గెలుపును అందుకుంది.


విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు తేలిపోవడంతో కివీస్ ఓపెనర్లు అదరగొట్టారు. మిడిలార్డర్ విఫలమైనా ఆఖర్లో పరుగులు రావడంతో న్యూజిలాండ్ 215/7 పరుగులు చేసింది.


న్యూజిలాండ్ అందించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గువాహటి మ్యాచ్‌లో మొదటి బంతికే సంజూని అవుట్ చేసిన మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను ఫస్ట్ బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఇషాన్ కిషన్ లేకపోవడంతో ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. దాంతో భారత్ 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


సంజూ శాంసన్ - రింకూ సింగ్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ బాగా ఆడుతున్నారు అనుకున్న సమయంలో 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 24 పరుగులు చేసిన సంజూ శాంసన్‌ను మిచెల్ శాన్‌ట్నర్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా శాన్‌ట్నర్ బౌలింగ్‌నే వికెట్ కోల్పోయాడు. 30 బంతుల్లో 39 పరుగులు చేసిన రింకూ సింగ్ కూడా అవుటవ్వడంతో భారత్ 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


అదే సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దుబే ఒక్కసారిగా మ్యాచ్‌ని మార్చేశాడు. మిగతా బ్యాటింగ్ లైనప్ మొత్తం బౌలర్లే ఉండటంతో హిట్టింగ్ మొదలుపెట్టిన దుబే కేవలం 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ భారత్ చేతుల్లోకి వస్తోంది అనుకున్న సమయంలో హర్షిత్ రాణా స్ట్రయిట్ షాట్ ఆడగా అది నేరుగా బౌలర్ చేతిని తగిలి నాన్‌స్ట్రయిక్ వికెట్లను తాకింది. దాంతో 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన దుబే 65 పరుగుల వద్ద అవుటయ్యాడు.


హర్షిత్ రాణా 13 బంతుల్లో 9 పరుగులు చేయగా, అర్ష్‌దీప్ సింగ్ డకౌట్ అయ్యాడు. బుమ్రా రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ 1 పరుగుకే అవుటవ్వడంతో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో శాన్‌ట్నర్ 3 వికెట్లు తీసుకోగా.. ఇష్ సోడి, జాకబ్ డప్ఫీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మ్యాట్ హెన్రీ, జాక్ ఫోక్స్‌కి చెరొక వికెట్లు పడ్డాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ ఒక విజయం సాధించింది. ఆఖరి టీ20 జనవరి 31న తిరువనంతపురం వేదికగా జరగనుంది.

Latest News
Beating Retreat ceremony strength of India’s rich military heritage, says PM Modi Thu, Jan 29, 2026, 11:59 AM
AI-enabled stethoscopes may boost diagnosis of heart diseases: Study Thu, Jan 29, 2026, 11:54 AM
Foreign ministers start arriving in Delhi for 2nd India-Arab meet Thu, Jan 29, 2026, 11:43 AM
S.Korea's Science ministry unveils road map for quantum industry Thu, Jan 29, 2026, 11:42 AM
Free trade for ambitious, confident youth and Aatmanirbhar Bharat: PM Modi on India-EU pact Thu, Jan 29, 2026, 11:31 AM