|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:15 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మతిమరుపు (అల్జీమర్స్)తో బాధపడుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో అధికారుల పేర్లను ఆయన మరిచిపోయారు. ఈ క్రమంలో న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మతిమరుపు ఉందని సాగుతోన్న ప్రచారంపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో ఇప్పుడూ అంతే పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన ఆయన స్పష్టం చేశారు. కానీ, తన తండ్రి అల్జీమర్స్‌తో బాధపడిన విషయం నిజమేనని అన్నారు.
అయితే, తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ‘అల్జీమర్స్’ అనే పదాన్ని ఆమర గుర్తుచేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో ట్రంప్ ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై మరోసారి చర్చను రేకెత్తించింది. ట్రంప్ తన తండ్రికి ‘గుండె దడ’ ఉందని, పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని, కానీ ఒక వ్యాధి మాత్రం ఉందని చెప్పారు. ఆయనకు సుమారు 86, 87 ఏళ్ల వయసులో ‘ఏమంటారు దాన్ని?’ అని అడిగి, తన నుదుటిపై వేలుపెట్టి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్‌ను చూశారు. లీవిట్ ‘అల్జీమర్స్’ అని చెప్పగా.. ‘మతిమరుపు లాంటిది. సరే, నాకు అది లేదు’ అని ట్రంప్ అన్నారు.
వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి ఆందోళన చెందుతున్నారా? అని ప్రశ్నించగా.. ట్రంప్ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. తన తండ్రి ఫ్లయిడ్ ట్రంప్ 1990లలో అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారని, 1999లో 93 ఏళ్ల వయసులో మరణించే వరకు ఆ వ్యాధితో బాధపడ్డారని ఆయన గతంలోనే చెప్పారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇలాంటి సమస్యే ఎదురయ్యింది.
కాగా, ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన మాటల తడబాటునా లేక మానసిక సమస్యలకు సంకేతమా అని అనుమానిస్తున్నారు. కొందరు మాత్రం దీనిని కొట్టిపారేశారు. అమెరికాలో సీనియర్ రాజకీయ నేతల మానసిక స్థితిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 78 ఏళ్ల ట్రంప్.. తన ఫిట్‌నెస్ గురించి ఆందోళనలను పదేపదే కొట్టిపారేస్తూనే.. అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉన్నానని, తాను "ACED" చేసిన కాగ్నిటివ్ పరీక్షల గురించి తరచుగా చెప్పుకుంటారు.
ఇక, వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్.. అధ్యక్షుడు పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉన్నారని, సూపర్ హ్యూమన్ ప్రెసిడెంట్ అని వర్ణించారు. ప్రెస్ సెక్రటరీ లీవిట్ సైతం ట్రంప్ రాత్రులు ఆలస్యంగా పనిచేస్తారని, తన సిబ్బందిలో చాలామంది కంటే ఎక్కువ చురుకుగా ఉంటారని తెలిపారు.
Latest News