ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి దారుణం.. వెంటనే సర్జరీ చేయకపోతే
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:16 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న ఆయనకు.. తక్షణమే సరైన చికిత్స అందకపోతే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పార్టీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 'సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్' అనే తీవ్రమైన కంటి సమస్య ఉన్నట్లు వార్తలు రావడంతో.. పాక్ రాజకీయాల్లో కలకలం రేగుతోంది.


ఇమ్రాన్ ఖాన్‌కు అంధత్వ ముప్పు..


మీడియా నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలోని రెటినల్ సిరలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీనివల్ల కంటికి రక్త ప్రసరణ తగ్గి, రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే అత్యవసరంగా ఆపరేషన్ చేయకపోయినా, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించకపోయినా ఆయన శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే జైలు అధికారులు మాత్రం ఆయనకు జైలు లోపలే చికిత్స అందిస్తామని పట్టుబట్టడంపై పీటీఐ మండిపడుతోంది. జైలులో అపరేషన్ చేసే స్థాయి వసతులు లేవని, ఆయనను వెంటనే శౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి లేదా ఆయన కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తోంది.


2024 అక్టోబర్ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను తన వ్యక్తిగత వైద్యుడు కూడా కలవడానికి జైలు అధికారులు అనుమతించలేదని పీటీఐ ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. జైలు అధికారులు వైద్య పరీక్షలకు అనుమతించడం లేదని, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించింది.


మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నొరీన్ ఖానుమ్ అడియాలా జైలు వెలుపల ఆందోళన చేపట్టారు. అసలు ఈ వార్తలు నిజమో కాదో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. "మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయనకు కంటి సమస్య ఉంటే మాకు ఎందుకు చెప్పలేదు? ఈ వార్తలు ఎవరు లీక్ చేస్తున్నారు?" అని అలీమా ఖాన్ ప్రశ్నించారు. కేవలం వైద్య సహాయం మాత్రమే కాకుండా ఆయనను వెంటనే విడుదల చేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని కూడా వారు స్పష్టం చేశారు.


అలాగే ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించాలని కోరుతూ పీటీఐ నేతలు ఇస్లామాబాద్ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఒక ఖైదీని కలవడం చట్టపరమైన హక్కు అని, ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ ఆరోగ్యంపై తాము ఆందోళన చెందుతున్నామని పీటీఐ ఛైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ తెలిపారు. కాగా మే 9వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన ఐదు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు, తోషాఖానా కేసులో బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్‌ను కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది.

Latest News
PM Modi meets Deve Gowda, praises his insights on key issues Thu, Jan 29, 2026, 04:58 PM
Central ministers Jural Oram, Kishan Reddy participate in Medaram tribal fair Thu, Jan 29, 2026, 04:50 PM
Innovation and ethics are key for AI in law, says Cyril Shroff at JGU public lecture Thu, Jan 29, 2026, 04:30 PM
People, students celebrate as SC stays new UGC equity regulations Thu, Jan 29, 2026, 04:25 PM
Ponting backs Maxwell to overcome lean run, discover form in time for T20 WC Thu, Jan 29, 2026, 04:20 PM