|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:53 PM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మరోసారి విమాన ప్రమాదాల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి.. అనూహ్యంగా విమానం, హెలికాప్టర్ ప్రమాదాల్లో చనిపోయిన నేతలు ఎందరో ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నేతాజీతో మొదలుకుంటే.. సంజయ్ గాంధీ, మాధవరావు సింధియా, బాలయోగి, వైఎస్ఆర్, సీడీఎస్ బిపిన్ రావత్ వంటి మహా నేతలు.. ఇలాంటి గగనతల ప్రమాదాల్లో అమరులయ్యారు. అత్యంత భద్రత కలిగిన విమానాల్లో ప్రయాణించినా.. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు తలెత్తి.. దేశానికి తీరని రాజకీయ శూన్యతను మిగిల్చిన ఘటనలు ఉన్నాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1945)
భారతదేశానికి బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్య్రం రాక ముందే తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు చెబుతారు. ఇది భారత రాజకీయాల్లో మొదటి పెద్ద విమాన ప్రమాదంగా నిలిచింది.
హోమీ జహంగీర్ బాభా (1966)
భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాభా ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఆయన చనిపోయారు.
సంజయ్ గాంధీ (1980)
ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ స్వయంగా విమానం నడుపుతూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూలి మరణించారు.
మాధవరావు సింధియా (2001)
కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్ పార్టీ దిగ్గజం అయిన మాధవరావు సింధియా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి కేంద్రమంత్రి అయ్యారు.
ఎంసీ బాలయోగి (2002)
లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న బాలయోగి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి (2009)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చిత్తూరు జిల్లా నల్లమల అడవుల్లో వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ కూలి మరణించడం యావత్ దేశాన్నే తీవ్ర విషాదంలో ముంచేసింది.
డార్జీ ఖండూ (2011)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డార్జీ ఖండూ సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి దుర్మరణం చెందారు.
జనరల్ బిపిన్ రావత్ (2021)
దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ రావత్ తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కూలి దుర్మరణం చెందారు.
విజయ్ రూపానీ (2025)
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో మరణించారు.
Latest News