|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:56 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈ ఉదయం (జనవరి 28 బుధవారం) బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో అజిత్ పవార్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు. అయితే అజిత్ పవార్ మరణవార్త వికీపీడియాలో 20 గంటల ముందే వచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టైమ్ జోన్‌ల మధ్య తేడా (సమయ మండలాల వ్యత్యాసం).. వికీపీడియా ఓపెన్ ఎడిటింగ్ సౌకర్యం వల్ల ఈ గందరగోళం ఏర్పడినట్లు తేలింది. కుట్ర పూరితంగా కొందరు తప్పుడు స్క్రీన్ షాట్లను సృష్టించి వైరల్ చేస్తున్నారని.. ఈ మరణం పూర్తిగా విమాన ప్రమాదం వల్లే జరిగిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదం , ఆయన మరణవార్త అధికారికంగా తెలియక ముందే.. అంటే దాదాపు 20 గంటల ముందే వికీపీడియాలో రిపోర్ట్ అయిందంటూ కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం 8:45 గంటలకు కూలిపోయింది. అయితే.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రే ఆయన వికీపీడియా పేజీలో మరణించిన తేదీ అప్‌డేట్ అయిందని.. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా వికీపీడియా ఎడిట్ హిస్టరీకి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.
అసలు నిజం ఏంటి?
ఈ వైరల్ వార్తల్లోని వాదనలు పూర్తిగా అవాస్తవమని.. సాంకేతిక అవగాహన లేకపోవడం వల్ల పుట్టినవని నిపుణులు తేల్చారు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
సమయ మండలాల వ్యత్యాసం
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం యూటీసీ సమయాన్ని వికీపీడియా అనుసరిస్తుంది. భారత కాలమానం ఐఎస్‌టీ కంటే యూటీసీ 5.30 గంటల వెనుక ఉంటుంది. ఒకవేళ బుధవారం ఉదయం 10 గంటలకు ఎవరైనా ఎడిట్ చేస్తే.. అది వికీపీడియా రికార్డుల్లో ఉదయం 4:30 (యూటీసీ) అని చూపిస్తుంది. ఈ సమయ వ్యత్యాసాన్ని గమనించని వారు.. విమానం కూలక ముందే ఎడిట్ జరిగిందని పొరపడుతున్నారు.
వికీపీడియాను ఎవరైనా ఎడిట్ చేసే సౌకర్యం
వికీపీడియా అనేది ఒక ఓపెన్ సోర్స్ ఎన్‌సైక్లోపీడియా. ప్రమాదం జరిగిన వెంటనే నిమిషాల వ్యవధిలో ఎవరైనా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు. అజిత్ పవార్ ప్రమాద వార్త తెలిసిన వెంటనే అంటే ( ఉదయం 9:30 గంటల IST తర్వాత) పలువురు యూజర్లు వేగంగా ఆ పేజీని అప్‌డేట్ చేశారు.
ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్ ట్రిక్
ప్రస్తుతం వైరల్ అవుతున్న కొన్ని స్క్రీన్ షాట్లు ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్ అనే టూల్ ఉపయోగించి సృష్టించినవని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా బ్రౌజర్‌లో కనిపించే టెక్స్ట్ ను తాత్కాలికంగా మార్చి స్క్రీన్ షాట్ తీయవచ్చని చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు స్క్రీన్ షాట్ల ద్వారా కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
అజిత్ పవార్ మరణంపై వికీపీడియాలో ముందే అప్‌డేట్ అయ్యిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా, ఏటీసీ రికార్డుల ప్రకారం.. బారామతి ఎయిర్‌పోర్టులో పైలట్‌కు రన్‌వే సరిగా కనపడకపోవడంతో జరిగిన ప్రమాదమని ప్రాథమికంగా తేలింది. ప్రజలు ఇలాంటి నిరాధారమైన సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.