డిప్యూటీ సీఎం మరణంతో మహాయుతికి ఎదురుదెబ్బ,,,,శరద్ పవార్‌, అజిత్ పవార్ వర్గాలు కలయికకు ఛాన్స్
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:51 PM

విమానం ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతితో మహారాష్ట్రలోని అధికార 'మహాయుతి' కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో విభేదాలు, ఆ తర్వాత వచ్చిన చేదు అనుభవాల నేపథ్యంలో, ఈ కూటమికి ఇది అత్యంత నష్టం కలిగించే పరిణామం. 2022లో ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత ఏడాదికి, అజిత్ పవార్ కూడా తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి, మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ముఖ్యమంత్రిగా షిండే, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ డిప్యూటీసీ సీఎంలుగా ఏర్పడిన ప్రభుత్వం 2024 వరకు సజావుగా సాగింది. అయితే, ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో కూటమికి మొదటి పెద్ద సవాలు ఎదురైంది.


మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచినా.. సాధారణ మెజార్టీకి 13 అడుగుల దూరంలో నిలిచింది. షిండే సేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గం కేవలం 20 సీట్లతో ప్రతిపక్షంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఈ విజయానికి తన పాలన, పథకాలే కారణమని వాదించిన షిండే, ముఖ్యమంత్రి పదవిని కొనసాగించాలని కోరారు. కానీ, బీజేపీ అందుకు అంగీకరించలేదు. చివరకు షిండే డిప్యూటీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ కలిస్తే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం వారికి ఉంది. షిండే, పవార్‌ల మధ్య సమతౌల్యం పాటించడం ద్వారా, ఇద్దరూ ఎక్కువ అధికారం కోసం ఒత్తిడి చేయకుండా బీజేపీ చూసుకుంది.


కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో పరిస్థితులు మారాయి. మహాయుతి పార్టీలు కొన్ని చోట్ల ఒకరితో ఒకరు పోటీ పడ్డాయి. ముఖ్యంగా, ముంబయి, పుణె, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో షిండే సేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. దీంతో అజిత్ పవార్‌ను పక్కన పెట్టారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు. పవార్ కుటుంబం తిరిగి కలవడంపై చర్చలు మొదలయ్యాయి. పుణె, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒకప్పుడు ఎన్సీపీకి బలమైన కోటలుగా ఉన్న ఈ ప్రాంతాల్లో, రెండు పవార్ వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.


అప్పుడే అసలు గొడవ మొదలైంది. ముఖ్యంగా అజిత్ పవార్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయేలో చేరడానికి ముందు, తనపై వచ్చిన రూ. 70,000 కోట్ల నీటిపారుదల కుంభకోణం ఆరోపణలను ప్రస్తావిస్తూ.. 2017 నుంచి 2022 మధ్య బీజేపీ అధికారంలో ఉన్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొమ్మిదేళ్లుగా అవినీతి రాజ్యమేలిందని, అప్పులు పెరిగిపోయాయని ఆరోపించారు. ‘నాపై రూ. 70,000 కోట్ల నీటిపారుదల కుంభకోణం ఆరోపణలు వచ్చాయని అందరికీ తెలుసు. ఈరోజు, ఆ ఆరోపణలు చేసిన వారితోనే నేను అధికారంలో ఉన్నాను. నిరూపణ కాకముందే ఒక వ్యక్తిని దోషిగా ముద్ర వేయవచ్చా?’ అని పవార్ ప్రశ్నించారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ‘దొంగల ముఠాలతో’ నిండిపోయిందని, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నవారికి ‘అహంకారం’ ఎక్కువగా ఉందని, కాంగ్రెస్, ఎన్సీపీ పాలించినప్పుడు ఆ అహంకారం లేదని ఆయన అన్నారు.


దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తూ.. పవార్‌ను ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కష్టాలు తప్పవని హెచ్చరించింది. ఫడ్నవీస్ మరింత సూటిగా స్పందించారు. ‘కొంతమంది ఎన్నికల గంట మోగగానే గొంతు విప్పుతారు’ అని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ, అజిత్ పవార్ సంయమనం కొంతవరకు దెబ్బతిందని ఆయన అన్నారు. పుణె, పింప్రి-చించ్వాడ్‌లలో బీజేపీ భారీ విజయం సాధించింది. బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మేయర్‌ పదవికి షిండే శివసేన మద్దతు అవసరం. ఇది మరో ఘర్షణకు దారితీసింది, ఇంకా పరిష్కారం కాలేదు.


ఈ నేపథ్యంలోనే, బుధవారం ఉదయం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి దుర్మరణం చెందారు. దీంతో మహారాష్ట్ర ఒక కీలక నేతను కోల్పోవడమే కాకుండా, మహాయుతికి ఒక ముఖ్యమైన వ్యక్తిని, షిండే ఆశయాలను అదుపులో ఉంచగల బీజేపీ ఆస్త్రాన్ని కోల్పోయేలా చేసింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) వైపు వెళ్లకుండా చూడటం బీజేపీ, ఫడ్నవీస్‌లకు పెద్ద సవాల్. అలా జరిగితే ప్రతిపక్షాలు బలపడటంతో పాటు, అధికార కూటమిలో షిండే స్థానం కూడా బలపడుతుంది. దీనికి ఒక మార్గం, అజిత్ పవార్ పదవి పార్టీలోని మరొకరికి ఇవ్వడం. కానీ, ఆ పార్టీ‌లో నెంబర్ 2 లేకపోవడంతో ఇది కష్టమే.


ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద ప్రశ్న, ఎన్సీపీ తన తిరుగులేని, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని కోల్పోయిన తర్వాత రెండు ఎన్సీపీల భవిష్యత్తు ఏమిటనేది. అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం తన బాబాయ్ వర్గాన్ని వెనక్కినెట్టి, అసలైన ఎన్సీపీగా తనను తాను నిరూపించుకుంది. ఎన్సీపీలో తిరిగి కలయికపై చర్చల నేపథ్యంలో, అజిత్ పవార్ మహారాష్ట్రలో నాయకత్వం వహిస్తారని, శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ఢిల్లీ వ్యవహారాలు చూసుకుంటారని భావించారు. అజిత్ పవార్ ఎన్సీపీలో లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరే, రాజ్యసభ ఎంపీలు ప్రఫుల్ పటేల్, అజిత్ భార్య సునేత్ర పవార్ నాయకత్వ వరుసలో ముందున్నారు. వీరు ఇప్పుడు అధికారం కోసం పోటీ పడవచ్చు.


అజిత్ కుమారుడు పార్థ్ పవార్ కూడా ఈ రేసులో ఉండే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయి, గత ఏడాది పుణెలో భూ కుంభకోణం ఆరోపణల్లో చిక్కుకున్న తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం విఫలమైంది. ఈ వర్గానికి మరో రెండు అవకాశాలున్నాయి. ఇద్దరు మాజీ మంత్రులు, ధనంజయ్ ముండే, ఛాగన్ భుబ్‌బుల్, వీరికి ప్రజాదరణ ఉన్నప్పటికీ, విశ్లేషకుల ప్రకారం ఇద్దరూ ముందు వరుసలో లేరు. ఎన్సీపీలు ఏకమైతే ఈ పోటీ మరింత తీవ్రమవుతుంది. శరద్ పవార్.. తన కుమార్తె సుప్రియా సూలే పార్టీ ముఖచిత్రంగా నిలపడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఇది అజిత్ భార్య సునేత్ర పవార్, ఆయన వర్గం వ్యతిరేకించవచ్చు. దీంతో పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Latest News
Bhavnath Mahashivratri fair to be grand and memorable: Gujarat Dy CM Fri, Jan 30, 2026, 04:45 PM
Wings India testament of the world's confidence in India's aviation growth story: Union Minister Fri, Jan 30, 2026, 04:30 PM
Bangladesh: US Embassy in Dhaka issues security alert ahead of Feb elections Fri, Jan 30, 2026, 04:22 PM
Gujarat govt clears Rs 663 crore for Gram Panchayat buildings in 2,666 villages Fri, Jan 30, 2026, 04:12 PM
India-EU free trade pact aligns with vision of a developed India: PM Modi Fri, Jan 30, 2026, 04:10 PM