|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:04 PM
2026 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు మెంటర్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను నియమించే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగా టోర్నీకి ముందు అనుభవజ్ఞుడైన ఆటగాడి మార్గనిర్దేశం జట్టుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటర్‌గా వ్యవహరించారు.యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు టీమిండియా గెలవడంలో యువీ పాత్ర కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడిగా యువీకి పేరుంది. అలాంటి ఆటగాడు మెంటర్‌గా ఉంటే.. యువ క్రికెటర్లకు మానసికంగా, సాంకేతికంగా ఎంతో బలం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం, టీ20 ఫార్మాట్‌లో నిరంతర మార్పులు చోటుచేసుకోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మెంటర్ పాత్ర మరింత కీలకంగా మారింది. మ్యాచ్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అనే విషయాల్లో యువరాజ్ అనుభవం ఆటగాళ్లకు దోహదపడనుందని భావిస్తున్నారు.
Latest News