|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:04 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలో ఉండే భూమి లేని నిరుపేదలకు, అనాథ పిల్లలకు పింఛన్లు అందించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మొత్తం 35 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్‌లో చర్చించారు. అధికారికంగా సిట్ నివేదిక వచ్చిన తర్వాత స్పందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ప్లాట్లు పొందిన రైతులలో కొంతమంది వీధిపోట్లు, వీధిమూల ప్లాట్లు వచ్చాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి రైతులకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలో అనాథ పిల్లలకు, భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనాథ పిల్లలకు పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే సీఆర్డీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే భూములు లేని పేదల నుంచి పింఛన్ల కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
మరోవైపు కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే పలమనేరులో ఏర్పాటు చేయబోయే లైవ్‌స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇక అర్జున అవార్డు విజేత జ్యోతికి ఏపీ కేబినెట్ తీపికబురు వినిపించింది.
జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. జ్యోతి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరి జిల్లా నందకోటలో ఫైవ్‌స్టార్ రిసార్ట్ నిర్మాణంతో పాటుగా, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Latest News