|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:08 PM
రాజకీయాల్లో సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలోని వ్యక్తులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అవకాశం దొరికితే చాలు.. ఆటాడుకుందాం అని భావిస్తుంటారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. అప్పుడప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులపైనా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాత్రం ఇటీవల ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి .. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీరామ్‌పై ప్రశంసలు కురిపించటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడీ అంశం మరో మలుపు తీసుకుంది. ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీవీ కొండారెడ్డి అనే అధికారిని నియమించింది.
అయితే ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐగా 2025 డిసెంబర్ 18న శ్రీరామ్ బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు స్వీకరించిన 40 రోజుల్లోనే బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐగా శ్రీరామ్ మంచి పనితీరు కనబరిచారనే అభిప్రాయం స్థానికంగా ఉంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా సంక్రాంతి సమయంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామ్‌ను ప్రశంసించారు. సీఐ శ్రీరామ్ ఎలాంటి లంచాలకు లొంగకుండా... ఎవరికీ తలొగ్గకుండా నిజాయితీగా తన విధిని నిర్వహిస్తున్నారని శివప్రసాద్ రెడ్డి కొనియాడారు.
ప్రొద్దుటూరు వన్ టౌన్ పరిధిలోని లిక్కర్ షాపులు ఆయన వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయన్నారు. లిక్కర్ మాఫియా ఒత్తిళ్లకు సీఐ లొంగడం లేదని.. మద్యం దుకాణాలు వేళలు పాటిస్తున్నాయన్నారు. బెల్టు షాపులను సైతం నియంత్రిస్తున్నారని కొనియాడారు. తమ పార్టీకి నష్టమైనా సరే .. ఇలాంటి నిజాయితీ గల అధికారులను అభినందించాల్సిందేనన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. అయితే ఇలాంటి అధికారులను ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తుందో చూడాలని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పొగిడారనే కాకుండా.. సీఐ శ్రీరామ్ పనితీరుపై స్థానికంగానూ మంచి పేరు ఉంది. ముఖ్యంగా క్రికెట్ బుకీలు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించడంపై సదభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కేవలం 40 రోజులలోనే ప్రొద్దుటూరు సీఐ శ్రీరామ్‌ను బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ బదిలీ వెనుక కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
Latest News