|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:28 PM
తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా, అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఒకేరోజు బ్రహ్మోత్సవంగా భావించే ఈ ఉత్సవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలను వీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ బోర్డు సూచనలతో జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.రథసప్తమి వేడుకలు ముగిసిన అనంతరం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాల వల్ల తిరుమలకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. గత అనుభవాలను, భక్తుల నుంచి స్వీకరించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సేవలను మరింత మెరుగుపరిచామని వివరించారు. రథసప్తమి నాడు అహోరాత్రులు శ్రమించిన అర్చకులు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Latest News