|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:49 AM
టెలికం రంగంలో జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు వైద్య పరీక్షల రంగంలో మరో భారీ విప్లవానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు ఉపయోగపడే జెనెటిక్ పరీక్షలను అత్యంత చౌకగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10,000 ఉన్న క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ పరీక్షను కేవలం రూ.1000కే అందించాలని యోచిస్తోంది.నాలుగేళ్ల క్రితం రూ.393 కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరుకు చెందిన 'స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్' సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించనుంది. ఈ సంస్థ జినోమిక్ సైన్స్ టెక్నాలజీని ఉపయోగించి రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాలతో భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ ప్రణాళికపై రిలయన్స్ సీనియర్ అధికారి, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ నీలేశ్ మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలనేది ముఖేశ్ అంబానీ లక్ష్యమని, అందుకే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా టైమ్‌లైన్ పెట్టుకోలేదని తెలిపారు. చౌక ధరలకే పరీక్షలు అందించి సమాజంపై తమదైన ముద్ర వేయాలనుకుంటున్నామని వివరించారు.
Latest News