|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:50 AM
పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నించిన దుండగుల ప్రయత్నాన్ని ఓ మహిళా మేనేజర్ తన ధైర్యంతో, సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. అనకాపల్లి రింగ్ రోడ్ వద్ద ఉన్న కెనరా బ్యాంకులో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించినా ఏమాత్రం బెదరకుండా ఆమె వ్యవహరించిన తీరుతో భారీ దోపిడీ ప్రమాదం తప్పింది.గురువారం మధ్యాహ్నం రెండు వాహనాల్లో వచ్చిన ఏడుగురు వ్యక్తులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వీరిలో ఐదుగురు లోపలికి ప్రవేశించి, నేరుగా మహిళా మేనేజర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు తుపాకీ గురిపెట్టి, బ్యాంకులోని నగదు, నగలు మొత్తం ఇచ్చేయాలని బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో బ్యాంకులో ఖాతాదారులు, సిబ్బంది కూడా ఉన్నారు.అయితే, దుండగులు తుపాకీతో బెదిరిస్తున్నా ఆ మేనేజర్ ఏమాత్రం భయపడలేదు. చాకచక్యంగా వ్యవహరించి తన వద్ద ఉన్న సెక్యూరిటీ అలారం బటన్‌ను నొక్కారు. దీంతో ఒక్కసారిగా సైరన్ మోగడంతో అప్రమత్తమైన దొంగలు, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో సిబ్బంది, ఖాతాదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Latest News