|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:47 AM
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) ఆందోళనకరంగా పడిపోవడంతో, భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పరిణామాలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్, హంగేరీ వంటి దేశాల్లో అమలు చేస్తున్న తరహాలో 'రెండో బిడ్డను కనేవారికి' ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.గురువారం అమరావతిలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ఈ ఆందోళనకరమైన గణాంకాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ బయటపెట్టారు. జాతీయ సగటు 28.4 ఏళ్లతో పోలిస్తే, ఏపీలో సగటు వయసు 32.5 ఏళ్లుగా ఉందని, ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తోందనడానికి సంకేతమని ఆయన వివరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది సాధారణంగా ఉండాల్సిన 2.1 కంటే చాలా తక్కువని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభాపై ఆధారపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు పెద్దపీట వేసిన తాము, ఇప్పుడు జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
Latest News