|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:14 PM
రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణం అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్‌ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేయాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం జరిగితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు. కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని బలోపేతం చేసే మార్గమని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ రహదారిపై సర్వే చేపట్టి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ టన్నెల్ నిర్మాణంతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు.
Latest News