|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:11 PM
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తండ్రి–కొడుకులపై జనసేన పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో మంగళాపురం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, విఎసిఎస్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి మరియు ఆయన కుమారుడు పేరం శివనాగరాజులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని 108 అంబులెన్స్ ద్వారా మచిలీపట్నం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగిరెడ్డికి తలపై తీవ్ర గాయం కావడంతో కుట్టు వేశారు. శివనాగరాజులకు తలపై, శరీరంపై లోతైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నాగిరెడ్డి బావమరిది తుమ్మా కోటయ్య కుమార్తె రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన బొర్ర రాజకుమార్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అందరూ ఒకే ప్రాంతంలో ఎదురెదురుగా నివాసం ఉంటున్నారు.మంగళవారం సాయంత్రం బొర్ర రాజకుమార్ తన సోదరులతో కలిసి కోటయ్య ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు. భయంతో కోటయ్య, అతని భార్య ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఆ సమయంలో “మాది జనసేన–కూటమి ప్రభుత్వం.. మమ్మల్ని ఆపేదెవరు?” అంటూ దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ విషయాన్ని కోటయ్య తన బావ నాగిరెడ్డికి తెలియజేయగా, పొలం పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4:30 సమయంలో ఇంటికి వచ్చిన నాగిరెడ్డి, “ఎందుకు తిట్టారు?” అని ప్రశ్నించడమే నేరంగా మారింది.అప్పటికే సిద్ధంగా ఉన్నట్టు బొర్ర రాజకుమార్, అతని సోదరులు ప్రమోద్, వినోద్, తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, రమేష్ కలిసి కర్రలు, రాడ్లతో నాగిరెడ్డి మరియు అతని కుమారుడిపై దాడి చేశారు. ఇరుగు పొరుగు వారు జోక్యం చేసుకుని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత విషమించేదని స్థానికులు చెబుతున్నారు.
Latest News