|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:10 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైయస్ఆర్‌సీపీ స్టేటే కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వద్ద పరిశీలించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే... ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజానిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్న వైయస్.జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు... కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్ గారికి కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు.
Latest News