|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:44 PM
తిరుపతిలో ఓ దొంగ హల్ చల్ చేశాడు. లేడీస్ హాస్టళ్లలోకి దూరి కలకలం రేపాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో దొంగోడి బాగోతం వెలుగు చూసింది. రాత్రిపూట లేడీస్ హాస్టళ్లల్లోకి చొరబడిన దుండగుడు.. సెల్‌ఫోన్లు చోరీ చేశాడు. తిరుపతిలోని భవానీ సర్కిల్ సమీపంలో ఉన్న రెండు హాస్టళ్లలో ఈ చోరీ జరిగింది. దొంగ రాత్రి సమయంలో హాస్టళ్లల్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించిన విద్యార్థులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో దొంగ యవ్వారం వెలుగుచూసింది. దీంతో ఫోన్లు చోరీకి గురయ్యాయంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు.
Latest News