|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:45 PM
పేద కుటుంబాలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చౌక దుకాణాలు (రేషన్ షాపులు) ఏర్పాటు చేసింది. రేషన్ దుకాణాల ద్వారా మధ్య తరగతి జీవులకు రాయితీపై కందిపప్పు. బియ్యం, రాగులు, జొన్నలు, పామాయిల్, చక్కెర వంటి నిత్యావసర సరుకులను ప్రతి నెలా అందిస్తోంది. అయితే రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో.. రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు కూడా తీసుకువచ్చింది. విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందించింది. క్యూఆర్ కోడ్ ముద్రించి ఉండే ఈ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారుల వివరాలు తెలుసుకోవటంతో పాటుగా.. రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుతుంది.
అలాగే ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన ఏర్పాటు కూడా చేసింది. రేషన్ దుకాణాల్లో ఏవైనా అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే.. అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఓ ఏర్పాటు కూడా చేసింది. అందులో భాగంగా ప్రతి రేషన్ షాపు వద్ద కూడా.. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓ ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటుచేయిస్తోంది. ఈ బోర్డు మీద ఆ రేషన్ దుకాణం డీలరు పేరుతో పాటుగా రేషన్ దుకాణం సంఖ్య, ఆ ఊరు పేరు, ప్రాంతం, మండలం పేర్లను కూడా పొందుపరిచింది.
అలాగే బోర్డు మీద ఆ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయిస్తోంది. రేషన్ కార్డుదారులు.. రేషన్ దుకాణంలో ఏవైనా అక్రమాలు గుర్తిస్తే.. ఉదాహరణకు తూకాల్లో తేడాలు, రేషన్ సరుకులు సక్రమంగా అందించకపోవటం వంటివి గుర్తిస్తే వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి పలు వివరాలను కూడా సేకరిస్తోంది. ప్రశ్నల రూపంలో అడిగి సమాధానాలు, అభిప్రాయాలు సేకరిస్తోంది. రేషన్ దుకాణంలో ఈ నెల సరుకులు తీసుకున్నారా.. సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా అనే ప్రశ్నలు అడుగుతారు.
అలాగే రేషన్ డీలర్ సరుకులను సరైన తూకంతోనే అందిస్తున్నారా, రేట్లు ఎక్కువగా తీసుకుంటున్నారా.. మర్యాద పూర్వకంగా ఉన్నారా అనే ప్రశ్నలు అడుగుతారు. వీటికి లబ్ధిదారులు అవును లేదా.. కాదు అనే సమాధానాలు అందించాల్సి ఉంటుంది. ఇవి పూర్తి చేసిన తర్వాత.. సెల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే మన అభిప్రాయాలు అధికారులకు చేరతాయి. ఈ విధంగా వచ్చే ఫిర్యాదులపై ఆ తర్వాత ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.
Latest News