|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:30 PM
కెనడాలో స్థిరపడిన ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయ సంతతికి కెనడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. పౌరసత్వానికి సంబంధించి దశాబ్దాలుగా ఉన్న కఠిన నిబంధనలను సవరిస్తూ.. జస్టన్ ట్రూడో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా వెలుపల జన్మించిన కెనడియన్ల పిల్లలకు కూడా పౌరసత్వం కల్పించేలా చట్టంలో మార్పులు చేసింది. ఈ మేరకు బిల్ సీ-71 ద్వారా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అధికారికంగా అమలులోకి వచ్చాయి.
ఏమిటీ మార్పు? ఎవరికి లబ్ధి?
గతంలో ఉన్న 'మొదటి తరం పరిమితి' నిబంధన ప్రకారం.. కెనడా బయట పుట్టిన కెనడియన్ల పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించేది కాదు. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడా గడ్డపై పుట్టి ఉంటేనే వారి పిల్లలకు పౌరసత్వం ఇచ్చేవారు. దీనివల్ల విదేశాల్లో ఉద్యోగాలు లేదా వ్యాపారాల రీత్యా నివసిస్తున్న వేలాది మంది కెనడియన్ల పిల్లలు పౌరసత్వం కోల్పోయి 'స్టేట్‌లెస్'గా మిగిలిపోయారు. కానీ తాజా సవరణలతో ఆ అడ్డంకులు తొలగిపోయాయి. దీని ప్రకారం.. డిసెంబర్ 15వ తేదీ కంటే ముందు విదేశాల్లో జన్మించిన వారు లేదా పాత నిబంధనల వల్ల పౌరసత్వం పొందలేకపోయిన వారు ఇప్పుడు నేరుగా పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే డిసెంబర్ 15వ తేదీ తర్వాత జన్మించే పిల్లల విషయానికొస్తే.. వారి తల్లిదండ్రులు ఆ శిశువు జననానికి ముందు కనీసం మూడేళ్ల పాటు (1,095 రోజులు) కెనడాలో నివసించి ఉండాలి. ఈ 'ఫిజికల్ ప్రెజెన్స్' నిరూపించుకుంటేనే వారి పిల్లలకు కెనడా పౌరసత్వం లభిస్తుంది. నిజానికి ఈ మార్పు వెనుక ఆంటారియో సుపీరియర్ కోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఉంది. 2009 నాటి పాత నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని.. ఇవి కెనడియన్ల మధ్య వివక్ష చూపుతున్నాయని 2023లో కోర్టు స్పష్టం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లకుండా, చట్టాన్ని సవరించడమే సరైన మార్గమని భావించిన ప్రభుత్వం ఈ కొత్త సంస్కరణలను అమలులోకి తెచ్చింది.
కెనడాలో భారతీయ సంతతి జనాభా గణనీయంగా ఉంది. వృత్తిరీత్యా అనేక మంది భారతీయులు కెనడా పౌరసత్వం పొందిన తర్వాత కూడా స్వదేశంతో లేదా ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉంటారు. అలాంటి వారి పిల్లలు విదేశాల్లో జన్మిస్తే ఎదురయ్యే పౌరసత్వ సమస్యలకు ఈ కొత్త చట్టం శాశ్వత పరిష్కారం చూపనుంది. "కెనడా పౌరసత్వాన్ని మరింత సమ్మిళితంగా, న్యాయబద్ధంగా మార్చడమే మా లక్ష్యం" అని ఇమిగ్రేషన్ రిఫ్యూజీ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) పేర్కొంది. తాజా మార్పులతో తమ కుటుంబ భవిష్యత్తుపై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయని ప్రవాస కెనడియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest News