|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:27 PM
సాధారణంగా పిల్లలకో, వృద్ధులైన తల్లిదండ్రులకో ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు పొందడానికి 'డిపెండెంట్' హోదా కోరుతుంటారు చాలా మంది. కానీ అమెరికాలోని ఓ మహిళ తన పెంపుడు కుక్కకు ఈ హోదా కల్పించాలని కోరుతూ ఏకంగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పై కోర్టులో కేసు వేసింది. ఈ వినూత్న న్యాయపోరాటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కుక్కే నా కూతురు..!
న్యూయార్క్, యూటా రాష్ట్రాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అమండా రేనాల్డ్స్ అనే మహిళ.. తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ 'ఫిన్నెగాన్ మేరీ రేనాల్డ్స్'ను లీగల్ డిపెండెంట్‌గా గుర్తించాలని పిటిషన్ వేశారు. "ఫిన్నెగాన్ అన్ని విధాలా నా కూతురితో సమానం. ఆహారం, నివాసం, వైద్యం.. ఇలా ప్రతిదానికీ అది నాపైనే ఆధారపడి ఉంది. అలాంటప్పుడు దానికి డిపెండెంట్ హోదా ఎందుకు ఇవ్వకూడదు?" అని ఆమె కోర్టును ప్రశ్నించారు. అలాగే ఫిన్నెగాన్ పోషణ కోసం తాను ఏటా సుమారు 5,000 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 4.5 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
అమెరికన్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 152 ప్రకారం.. ఒక వ్యక్తిపై ఆర్థికంగా ఆధారపడే వారిని డిపెండెంట్లుగా గుర్తించవచ్చని, ఆ నిబంధన ఫిన్నెగాన్‌కు కూడా వర్తిస్తుందని ఆమె వాదించారు. ప్రస్తుతం చట్టం ప్రకారం పెంపుడు జంతువులను ఆస్తిగా పరిగణిస్తారు. అయితే మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని.. కాబట్టి వాటిని 'నాన్-హ్యూమన్ డిపెండెంట్లు'గా గుర్తించాలని ఆమె కోరారు.
అమెరికా పన్ను నిబంధనల ప్రకారం.. పిల్లలను లేదా బంధువులను డిపెండెంట్లుగా చూపిస్తే 'చైల్డ్ టాక్స్ క్రెడిట్' వంటి భారీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. సర్వీస్ డాగ్స్ (సేవా కుక్కల)కు ఇప్పటికే కొన్ని రాయితీలు ఉన్నాయని, మరి తన పెంపుడు కుక్కకు ఆ హక్కు ఎందుకు ఉండదని ఆమె ప్రశ్నించారు. అయితే మెజిస్ట్రేట్ జడ్జి జేమ్స్ ఎం. విక్స్ ప్రస్తుతం ఈ కేసు ప్రక్రియపై స్టే విధిస్తూ.. ఐఆర్ఎస్ దాఖలు చేయబోయే డిస్మిస్ పిటిషన్ కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 62 శాతం మంది అమెరికన్లకు పెంపుడు జంతువులు ఉన్నాయి. అందులో 97 శాతం మంది తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమండా వేసిన ఈ కేసు.. జంతువుల చట్టబద్ధమైన హక్కులపై కొత్త చర్చకు తెరలేపింది.
Latest News