|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:31 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలను మరింత కఠినతరం చేశారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ మరో 20 దేశాలతో పాటు పాలస్తీనియన్ అథారిటీపై ప్రయాణ ఆంక్షలను విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో విధించిన ఆంక్షలకు అదనంగా వీటిని చేర్చడంతో.. అమెరికా ప్రవేశంపై పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
పూర్తి నిషేధం, పాక్షిక ఆంక్షలు
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. ఇందులో బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియాలు ఉన్నాయి. వీటితో పాటు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారు అమెరికాకు వలస రాకుండా పూర్తి నిషేధం విధించారు. గతంలో పాక్షిక ఆంక్షలు ఉన్న లావోస్, సియెర్రా లియోన్ దేశాలను కూడా ఇప్పుడు పూర్తి నిషేధిత జాబితాలోకి మార్చారు. మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. ఇందులో నైజీరియా, సెనెగల్, టాంజానియా, అంగోలా, జాంబియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలతో పాటు కరేబియన్ దేశాలైన డొమినికా, ఆంటిగ్వా అండ్ బార్బుడా కూడా ఉన్నాయి.
అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానం కారణంగా భద్రతా లోపాలను చూపిస్తోంది. ఆయా దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉండటం, నకిలీ పౌర పత్రాలు, నేర చరిత్రను తనిఖీ చేసే వీలు లేకపోవడం వంటి అంశాలను వైట్ హౌస్ ప్రస్తావించింది. అంతేకాకుండా వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, తమ దేశ పౌరులను తిరిగి తీసుకెళ్లడానికి ఆయా ప్రభుత్వాలు నిరాకరించడం వంటి కారణాల వల్ల ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా గత నెలలో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిపై అఫ్గాన్ పౌరుడు జరిపిన కాల్పుల ఘటన తర్వాత, వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ నిర్ణయించారు.
ఈ ఆంక్షల నుంచి ఇప్పటికే వీసాలు ఉన్నవారు, అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్లు, దౌత్యవేత్తలు, క్రీడాకారులు, అమెరికా ప్రయోజనాలకు అవసరమని భావించే వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. జాతీయ భద్రత పేరుతో ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధ సమయంలో అమెరికాకు సహకరించిన అఫ్గాన్ పౌరులకు ఇచ్చే ప్రత్యేక వీసాలపై (SIV) కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రభావిత దేశాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అమెరికా ప్రయాణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latest News