|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:34 PM
కోట్లాది మంది భారతీయులకు ఇష్టమైన మ్యాగీ నూడిల్స్, నీటిలో వేయగానే నూడుల్స్‌గా మారే మ్యాగీ క్యాప్సూల్ వీడియోల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలు 40 మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అయ్యాయి, కానీ అవి ఏఐ-జనరేటెడ్ అని తేలింది. దీనిపై మ్యాగీ ఇండియా సంస్థ స్పందిస్తూ, ఇవి ఏప్రిల్ ఫూల్స్ తరహా చిలిపి చేష్టలని పేర్కొంది. ఈ వీడియోల అప్రామాణికతను నెటిజన్లు కూడా గమనించారు.
మన దేశంలో దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ నూడిల్స్ బ్రాండ్ అయిన మ్యాగీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విచిత్రమైన వీడియోతో వార్తల్లో నిలిచింది. ఆ వైరల్ వీడియోల్లో.. మ్యాగీ సంస్థ ఒక కొత్త క్యాప్సూల్‌ను విడుదల చేసిందని.. దాన్ని మరుగుతున్న నీటిలో వేయగానే వెంటనే క్షణాల్లో నూడుల్స్‌గా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఒక వీడియోలో ఒక వ్యక్తి.. బ్రాండ్ పేరు ఉన్న చిన్న పసుపు రంగు క్యాప్సూల్‌ను వేడి నీటిలో వేయగా.. అది వెంటనే నూడుల్స్, మసాలాగా మారుతున్నట్లు చూపించారు.
ఇక మరో వీడియోలో.. అంతకంటే చిన్న క్యాప్సూల్‌ను ఉపయోగించి ఒక మహిళ కూడా అదే విధంగా నూడుల్స్‌ను తయారు చేసింది. ఈ వీడియోలు 4 కోట్ల వ్యూస్‌ను సాధించడంతో.. అసలు మ్యాగీ సంస్థ ఈ కొత్త క్యాప్సూల్ తీసుకువచ్చిన విషయం నిజమా కాదా అని నెటిజన్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. అయితే.. ఈ వైరల్ వీడియోలు అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి సృష్టించినవి అని తేలింది. ఈ మ్యాగీ క్యాప్స్యూల్ వీడియో నెట్టింట బాగా ట్రెండింగ్‌గా మారడంతో.. ఎట్టకేలకు ఈ ప్రచారంపై మ్యాగీ ఇండియా సంస్థ అధికారికంగా స్పందించింది.
ఇక వైరల్ అవుతున్న వీడియోల కింద మ్యాగీ ఇండియా చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దయచేసి ఇతర నెలల్లో కూడా ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోకండి అంటూ.. మ్యాగీ ఇండియా సంస్థ చమత్కారంగా కామెంట్ చేసింది. మరోవైపు.. ఆ వీడియోల ప్రామాణికతపైనా నెటిజన్లు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫోర్క్ ఆకారం వంగి ఉందని గుర్తించగా.. మరికొందరు ఆ వీడియోల్లో మనుషుల హావభావాలు సరిగ్గా లేవని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ హద్దులు దాటిపోతోందని ఇంకో యూజర్ వ్యాఖ్యానించారు.
Latest News