|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:50 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు అంగీకరించాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో సత్తాచాటిన కోహ్లీ.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లీ పేరు ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. కోహ్లీ ఈ టోర్నీలో పాల్గొంటానని సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
"విజయ్ హజారే ట్రోఫీలో తాను ఆడతానని విరాట్ కోహ్లీ ధృవీకరించాడు. అయితే అతడు ఎన్ని మ్యాచ్‌లలో ఆడతాడో ఇంకా స్పష్టంగా తెలియదు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటం అనేది డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే ఆటగాళ్లలో ఎంతో ఉత్సాహం నింపుతుంది" అని అని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తెలిపారు.
ఢిల్లీ జట్టు విజయ్ హజారే ట్రోఫీ లో డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. కర్ణాటకలోని ఆలూరులో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా విరాట్ కోహ్లీ.. చివరిసారిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఢిల్లీ, సర్వీసెస్ మధ్య జరిగిన మ్యాచులో అతడు బరిలోకి దిగాడు. ఒకవేళ ఇప్పుడు అతడు తుది జట్టులోకి వస్తే.. సుమారు 15 ఏళ్ల తర్వాత ఈ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో విరాట్ కోహ్లీతో పాటు.. రిషభ్ పంత్ కూడా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాలంటే.. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ ఫిట్‌నెస్ కాపాడుకోవాలని బీసీసీఐ ఇటీవల సూచించింది. దీంతో 37 ఏళ్ల కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ కూడా ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.
Latest News