|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:52 PM
దేశంలో ఇటీవలి కాలంలో మ్యూల్ అకౌంట్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రధాన బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. పెరుగుతున్న మోసాలను అరికట్టే చర్యలలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు తమ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా అకౌంట్ ఓపెనింగ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ విధానంలో ఇకపై అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉండదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి?
మ్యూల్ అకౌంట్ అనేది మోసగాళ్లు ఇతరుల ఖాతాలను ఉపయోగించి అక్రమంగా సంపాదించిన డబ్బును ఒకచోటి నుంచి మరొక చోటికి తరలించే ప్రక్రియ. సైబర్ నేరగాళ్లు అమాయకులను లేదా ఆర్థికంగా అవసరమున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారి పేరు మీద బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తారు. ఈ ఖాతాల ద్వారానే మోసాలకు సంబంధించిన డబ్బు లావాదేవీలు జరిపిస్తారు. దీనివల్ల అసలు మోసగాళ్లను గుర్తించడం కష్టమవుతుంది.
ఈ మ్యూల్ అకౌంట్ కార్యకలాపాలు ఎక్కువగా వీడియో కేవైసీ, డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియల ద్వారానే జరుగుతున్నాయని బ్యాంకులు గుర్తించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రధాన బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను తాత్కాలికంహా నిలిపివేశాయి. కొత్తగా పొదుపు ఖాతాలు, ముఖ్యంగా జీరో-బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ ఖాతాలను పూర్తిగా డిజిటల్‌గా తెరవడాన్ని బ్యాంకులు తాత్కాలికంగా ఆపేశాయి. డిజిటల్‌గా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వినియోగదారులు ఖాతాను యాక్టివేట్ చేయడానికి భౌతికంగా బ్రాంచ్‌ను సందర్శించడం లేదా బ్యాంక్ అధికారి తనిఖీని పూర్తి చేయడం తప్పనిసరి చేశాయి. చిన్న మొత్తంలో బ్యాలెన్స్ ఉండే ఖాతాలకు మరింత కఠినమైన ధృవీకరణ, నిఘాను అమలు చేస్తున్నాయి.
అయితే ఈ చర్యల కారణంగా కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు ఆలస్యం జరుగుతోంది. గతంలో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావడానికి 15 రోజుల వరకు సమయం పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకే డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఆయా బ్యాంకులు చెబుతున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ మ్యూల్ అకౌంట్ల సమస్యను తీవ్రంగా పరిగణించింది. డిజిటల్ లావాదేవీల వృద్ధికి అనుగుణంగా, ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ బ్యాంకర్లకు స్పష్టం చేసింది. తప్పుడు ఖాతాలు తెరవడం ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి, బ్యాంకులు రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను పటిష్టం చేయాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ కేవైసీ ప్రక్రియను మరింత సురక్షితం చేయాలని సూచించింది. బ్యాంకులు తీసుకున్న ఈ తాత్కాలిక చర్యలు వినియోగదారులకు కొంత అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ, ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతకు మరియు నేరాల నియంత్రణకు అవసరమైన అడుగుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.