|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:53 PM
వందల విమానాలు రద్దు అవుతూ విమాన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇండిగోలో సంక్షోభం తలెత్తి ఈ పరిస్థితి దారితీసింది. ఇలాంటి తరుణంగా టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. పైలట్ల నియామకం చేపడుతున్నట్లు తెలిపింది. పైలట్ల రిక్రూట్‌మెంట్ ప్రకటన చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తగినంత మేర పైలట్లు, సిబ్బందిని నియమించుకోకపోవడంతో ఇండిగో కొన్ని రోజులుగా వందల విమానాలు రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంగా పైలట్ల నియామకానికి ఎయిరిండియా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆకాశం హద్దు కాదు అది ప్రారంభం మాత్రమే అంటూ ఎయిరిండియా ఓ పోస్ట్ చేసింది. 'భారత విమానయాన రంగం భవిష్యత్తు నిర్దేశకులుగా మారండి. విమానాల సంఖ్యను పెంచుకుంటున్న తరుణంలో అనుభవజ్ఞులైన ఏ320, బీ737 పైలట్ల కోసం ఆహ్వానిస్తున్నాము. డిసెంబర్ 22, 2025 తేదీ లోగా దరఖాస్తు చేసుకోండి' అని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఎయిరిండియా ప్రస్తుతం ఒక్కో విమానానికి సగటున 5.4 మంది పైలట్లను కేటాయిస్తోంది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో 2.5 మాత్రమే. అంటే ఎయిరిండియాలో ఒక్కో విమానానికి రెట్టింపు పైలట్లు, సిబ్బంది ఉంటున్నారు.
మరోవైపు.. సంక్షోభం తలెత్తిన క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇండిగో. ఈ ఎయిర్‌లైన్స్ సైతం భారీగా పైలట్లను నియమించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 2026, ఫిబ్రవరి 10 నాటికి 158 మంది పైలట్లను, 2026, డిసెంబర్ నాటికి మరో 742 మంది అంటే మొత్తం 900 మంది పైలట్లను నియమించుకుంటామని కేంద్ర ప్రభుత్వాని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వచ్చే 12 నెలల కాలంలో 300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ అధికారులను నియమించుకుంటాని ప్రభుత్వానికి తెలిపినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంక్షోభానికి ఇప్పట్లే తెరపడే అవకాశాలు కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో పైలట్లను నియమించుకుంటనే ప్రస్తుత సమస్యకు తెరపడుతుందని అంటున్నారు.
Latest News