|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:52 PM
భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు మంగళవారం నుంచి తెరలేవనుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ , హార్దిక్ పాండ్యా.. ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కీలక సూచన చేశాడు.
మెడనొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్ ఆడనున్నాడు. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న అతడు.. జోరుగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇలాంటి సమయంలో రీఎంట్రీ ఇస్తున్న గిల్.. టీ20 ప్రపంచకప్ 2026 ముందు జట్టులో సుస్థిర స్థానంలో సంపాదించాలంటే ఈ సిరీస్‌లో తప్పకుండా రాణించాలని పఠాన్ సూచించాడు. లేకపోతే.. జట్టులో చోటు కష్టమని హెచ్చరించాడు.
“వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20 ఫార్మాట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడు మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ఆటగాడు. టీ20ల్లో అతడి సామర్థ్యం ఏంటో ఐపీఎల్‌లో మనమంతా చూశాం. తనను తాను నిరూపించుకునేందుకు సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ గిల్‌కు మంచి ఛాన్స్. అయితే శుభ్‌మన్‌పై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ అతడు దాన్ని అధిగమించగలడు. ఈ సిరీస్‌లో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నా” అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: డిసెంబర్ 09 - కటక్
రెండో టీ20: డిసెంబర్ 11 - ముల్లాన్‌పూర్
మూడో టీ20: డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20: డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20: డిసెంబర్ 19 - అహ్మదాబాద్
Latest News