|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:21 PM
భారత జాతీయ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ గేయాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు.. మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వైఖరికి ముడిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో వందేమాతరం 100వ వార్షికోత్సవం నాటి పరిస్థితులను మోదీ గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
వందేమాతరం అమల్లోకి వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు.. వార్షికోత్సవాలు జరుపుకుంటుండగా.. భారతదేశం ఎమర్జెన్సీలో చిక్కుకుందని.. భారత రాజ్యాంగం గొంతును నులమేశారని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం సాధించి పెట్టిన వందేమాతరం గేయానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. దాని గొప్పదనాన్ని మళ్లీ తీసుకురావడానికి ఇదే సరైన అవకాశమని ప్రధాని మోదీ లోక్‌సభ వేదికగా పేర్కొన్నారు.
వందేమాతరంను వ్యతిరేకించడంలో నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది ముస్లిం వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే జవహర్ లాల్ నెహ్రూ.. వందేమాతరం వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ఆరోపించారు. 1937లో కాంగ్రెస్, జాతీయ సమావేశాల్లో వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. దుర్గా, సరస్వతి వంటి హిందూ దేవతలను ప్రస్తావించే మిగతా 6 చరణాలను కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో వాటిని తొలగించాలని తెలిపారు.
వందే మాతరంలోని చరణాలను తొలగిస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ.. దాన్ని దేశ విభజన ఎజెండా అని అభివర్ణిస్తోంది. 1937లో వందేమాతరంలోని ఒక భాగాన్ని ఖండించారని.. దాన్ని చీల్చివేశారని.. ఆ విభజనే దేశ విభజనకు బీజం వేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక గతంలో నెహ్రూ రాసిన లేఖలను గుర్తు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్.. వందేమాతరంలో దేవతలను ప్రస్తావించడం అసంబద్ధమని నెహ్రూ పేర్కొన్నట్లు ఆరోపించారు.
అయితే నెహ్రూ మాత్రం.. తన లేఖల్లో ఆ చరణాలను దేవతలకు ముడిపెట్టడం అసంబద్ధమే కానీ.. ఆ పాట ఎలాంటి హానిచేయని అని పేర్కొనడం గమనార్హం. అయితే దాని సాహిత్యం ఆధునిక జాతీయవాద భావనలకు అనుగుణంగా లేదని కూడా నెహ్రూ రాశారు. నిజమైన మనోవేదనలను తీర్చడానికి మతతత్వవాదుల భావనలకు లొంగిపోలేమని కూడా నెహ్రూ తన లేఖల్లో పేర్కొన్నారు.
Latest News