|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:18 PM
వందేమాతరంను ఆమోదించి.. 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారం పార్లమెంటులో 10 గంటల చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ ఎంపీలు.. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. సంచలన ఆరోపణలు చేశారు. అయితే జాతీయ గేయంగా వందేమాతరం తీసుకురావడానికి నెహ్రూ నిరాకరించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వందేమాతరానికి వ్యతిరేకంగా నెహ్రూ రాసిన లేఖలు, కేబినెట్ నోట్‌లను బీజేపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్.. వందేమాతరం కన్నా జాతీయ గేయంగా జనగణమన ఎందుకు అనువైనదో వివరించారని వెల్లడించారు.
జాతీయ గేయానికి ట్యూన్ ముఖ్యమని నెహ్రూ వాదన
1948 మే 21వ తేదీ నాటి కేబినెట్ నోట్‌లో.. జాతీయ గేయంగా జనగణమనను ఎంచుకోవడానికి నెహ్రూ ప్రధాన కారణాలను స్పష్టం చేశారు. జాతీయ గేయం కేవలం పదాల రూపం కాకుండా.. సంగీతం లేదా ట్యూన్ కూడా అని పేర్కొన్నారు. దీన్ని ఆర్కెస్ట్రాలు, బ్యాండ్‌లు తరచుగా వాయిస్తారని.. అందుకే జాతీయ గేయానికి సంగీతమే అతి ముఖ్యమైన అంశమని అప్పుడు నెహ్రూ తెలిపారు.
వందేమాతరానికి ఎంత చారిత్రక ప్రాముఖ్యత ఉన్నా దాన్ని ఆర్కెస్ట్రా లేదా బ్యాండ్‌పై ప్రదర్శించేటపుడు సులభమైన ట్యూన్ కాదని నెహ్రూ అభిప్రాయం. ఇది కొంతవరకు దుఃఖంగా, పునరావృతమై ఉంటుందని పేర్కొన్నారు. అయితే వీటన్నింటికి జనగణమన అనువుగా ఉంటుందని.. ఎందుకంటే దాని సంగీతం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుందని తెలిపారు.
వందేమాతరం కేవలం స్వాతంత్ర్య పోరాటానికి చెందిన పాటగా మిగిలిపోవాలని జవహర్ లాల్ నెహ్రూ భావించారు. 1948 జూన్ 15వ తేదీన బెంగాల్ తొలి ముఖ్యమంత్రి బీసీ రాయ్‌కి.. నెహ్రూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వందేమాతరం మన పోరాటం, ఆకాంక్షను సూచిస్తుందని.. కానీ జాతీయ గేయం అనేది విజయం, నెరవేర్పును సూచించాలని పేర్కొన్నారు. వందేమాతరంలోని భాష సగటు వ్యక్తికి అర్థం కావడం చాలా కష్టమని నెహ్రూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ జనగణమన సరళంగా ఉంటుందని చెప్పారు.
ఈ విషయంపై శ్యామా ప్రసాద్ ముఖర్జీకీ కూడా నెహ్రూ వివరణ ఇచ్చారు. జాతీయ గేయంగా వందేమాతరం అనుకూలం కాదని.. ముఖ్యంగా ఆర్కెస్ట్రాలు వాయించడానికి దాని ట్యూన్ సరిపోదని ముఖర్జీకి 1948 జూన్ 21వ తేదీన రాసిన లేఖలో నెహ్రూ స్పష్టం చేశారు. వందేమాతరం గొప్ప చారిత్రక సంప్రదాయం కలిగినందని.. భారతదేశ ప్రధాన జాతీయ గీతంగా కొనసాగుతుందని.. అయితే జాతీయ గీత ట్యూన్‌గా జనగణమన సరిపోతుందని నెహ్రూ స్పష్టం చేశారు. ఇక దీనిపై ఈ తుది నిర్ణయాన్ని నెహ్రూ రాజ్యాంగ సభకు వదిలేశారు.
Latest News