|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:17 PM
చాలా మంది యువతులు.. దేవుళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడిని, శివుడిని పెళ్లి చేసుకుని.. తమ జీవితాలను వారికి అంకితం చేసి.. ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయేవారు చాలా మంది ఉంటారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల పింకీ శర్మ అనే యువతి.. సంప్రదాయ హిందూ వివాహ వేడుకలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా.. శ్రీ కృష్ణుడికి ఆజన్మాంత భక్తురాలుగా మారిపోయింది.
ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యౌర్ కాసిమాబాద్ గ్రామంలో జరిగిన ఈ అసాధారణ వివాహ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంప్రదాయ వివాహానికి వచ్చినట్లే భారీగా హాజరయ్యారు. ఇక పెళ్లి మండపాన్ని పింకీ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుడిగా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించారు. ఇక ఆ విగ్రహాన్ని.. పింకీ శర్మ బావమరిది ఇంద్రేష్ కుమార్ కారులో వేడుకగా తీసుకొచ్చారు. దాదాపు 125 మంది బరాత్ నిర్వహిస్తూ.. తీసుకువచ్చారు.
శ్రీకృష్ణుడి విగ్రహం ఊరేగింపు పింకీ శర్మ ఇంటికి చేరుకోగానే.. సంప్రదాయ స్వాగతం పలికారు. పింకీ శర్మ స్వయంగా ఆ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుని వివాహ వేదికపైకి తీసుకెళ్లింది. శ్రీకృష్ణుడి విగ్రహంతో దండలు మార్చుకున్న పింకీ శర్మ.. ఆ తర్వాత పాపిటలో సింధూరం పెట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయంలో అతిముఖ్యమైన సప్తపది (ఏడు అడుగుల కార్యక్రమం) సమయంలో.. ఆమె కృష్ణుడి విగ్రహాన్ని తన చేతుల్లో పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసింది.
ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా భక్తి నృత్యాలను నిర్వహించారు. ఇక ఆ మొత్తం గ్రామానికి విందు ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు ఉదయం వీడ్కోలు కార్యక్రమం జరిగినప్పటికీ.. పింకీ శర్మ.. శ్రీకృష్ణుడి విగ్రహంతో తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. చిన్ననాటి నుంచే.. పింకీ కృష్ణుడికి అంకితమైందని.. తన తాతతో కలిసి తరచూ బృందావనానికి వెళ్లేదని ఆమె తండ్రి సురేష్ చంద్ర తెలిపారు.
4 నెలల క్రితం.. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం తీసుకుంటున్నప్పుడు.. స్వచ్ఛమైన బంగారు ఉంగరం ఆమె స్కార్ఫ్‌లో పడింది. అది దేవుడి అనుగ్రహంగా భావించిన పింకీ.. ఇక మనుషులను పెళ్లి చేసుకోకుండా.. కేవలం కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయాన్ని మొదట్లో కుటుంబానికి చెప్తే వారు అర్థం చేసుకోలేదు.
కానీ ఆ తర్వాత పింకీ తీసుకున్న నిర్ణయం దేవుడి కోసమే కావడంతో వారు కూడా అంగీకరించారు. ఇక తన కుమారులతో సమానంగా.. పింకీ శర్మకు కుటుంబ ఆస్తిలో వాటాను ఇస్తానని కూడా తండ్రి హామీ ఇచ్చారు. తన జీవితం దేవుడికి అంకితమని.. చదువుకోవాలని ఉన్నప్పటికీ.. కృష్ణుడికి అంకితం కావడంలోనే తనకు అసలైన సంతృప్తి ఉందని ఒక ఇంటర్వ్యూలో పింకీ స్పష్టం చేసింది.
Latest News