|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:03 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపరాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అపరాల సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుతూ ఉండటంతో మార్కెట్లో వాటికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో మినప్పప్పు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మినుములు సాగు చేసేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మినుమ పంట సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా మినుముల విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనాలను కిట్ల రూపంలో అందించనున్నారు. ఒక్కో విత్తన కిట్‌లోనూ నాలుగు కేజీల విత్తనాలు ఉంటాయి. కేజీ మినుముల విత్తనాల మార్కెట్లో 130 నుంచి 140 రూపాయల వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకంగా చూస్తే నాలుగు కేజీలు అంటే సుమారుగా520 రూపాయల నుంచి రూ.560 వరకూ రైతుకు లబ్ధి చేకూరనుంది. అర ఎకరా భూమిలో మినుములు సాగు చేసేందుకు ఈ విత్తనాలు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు.
సాధారణంగా వరికోతల అనంతరం రైతులు అపరాల సాగుకు మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రస్తుతం వరి కోతల సీజన్ నడుస్తోంది. వరి కోతలు పూర్తైన తర్వాత మినుములు, అపరాల సాగు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వరి కోతలకు ముందే రైతులకు ఈ విత్తనాల కిట్లు అందించాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. మరోవైపు రైతులకు అధిక దిగుబడి వచ్చేందుకు మేలైన విత్తనాలను అందిస్తున్నారు. చీడపీడలకు, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మేలు రకం వంగడాలను విత్తన పంపిణీ కోసం ఎంపిక చేశారు. మినుములు మాత్రమే కాకుండా కందులు, రాగులు, జొన్నలు వంటి విత్తనాలను కిట్ల రూపంలో అందిస్తున్నారు.
మరోవైపు మినుము పంట సాగుకు మెట్ట, మాగాణి భూములు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వరి మాగాణులు అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మినుము సాగు చేసుకోవచ్చంటున్నారు. వరి కోతకు 4, 5 రోజుల ముందు మినుము విత్తనాలను మాగాణుల్లో వెదజల్లుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం చేయరాదని.. ఎరువుల వాడకం వద్దని సూచిస్తున్నారు. అలాగే అధిక మోతాదులో విత్తనాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. మెట్ట భూములలో అయితే తేమను నిలుపుకోగలిగే నేలలు మినుము సాగుకు అనుకూలమని చెప్తున్నారు. అలాగే భూమిని బాగా దుక్కి చేయాలని.. నత్రజని, భాస్వరం వంటి ఎరువులు వేసి దున్నాలని సూచిస్తు్న్నారు.
Latest News