|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 07:58 PM
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడు ఉంటాడనేది పెద్దలు చెప్పే మాట. అలాంటి ఘటనే శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు సూరత్ నుంచి హవాలా నగదును బెంగళూరుకు కారులో తరలిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మరో ముఠా.. వీరిని అడ్డగించింది. కారులో తరలిస్తున్న నగదులో రూ.3 కోట్ల రూపాయలను చోరీ చేసింది. అయితే ఇక్కడితో వ్యవహారం పూర్తి కాలేదు. ఆ వెనుక వస్తున్న మరో కారు.. హవాలా గుట్టును రట్టు చేసింది. సూరత్ వ్యక్తులను పోలీసులకు పట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇద్దరు వ్యక్తులు సూరత్ నుంచి హవాలా నగదును బెంగళూరుకు తరలిస్తున్నారు. ఓ కారులో రూ.4.20 కోట్లు తీసుకుని బెంగళూరుకు బయల్దేరారు. అయితే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్దకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును కొంతమంది దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న విషయం ఎలాగో తెలుసుకున్న దుండగులు.. మరో నాలుగు కార్లతో ఇన్నోవా కారును వెంబడించి. పెనుకొండ వద్ద కారును అడ్డగించారు. ఆ తర్వాత కారుతో పాటుగా సూరత్ వ్యక్తులను కిడ్నాప్ చేశారు. కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత ఓ ప్రదేశంలో కారును ఆపి ఇన్నోవా కారులోని హవాలా నగదులో 3 కోట్ల రూపాయలను దుండగులు చోరీ చేశారు. అయితే ఇన్నోవా కారులో సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో ఉన్న రూ.1.20 కోట్లను తీసుకెళ్లడం వారితో కుదరలేదు. దీంతో మూడు కోట్లు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
అయితే బెంగళూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు.. ఆ వెనుక వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కారు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ ఉద్యోగి.. చెక్ పోస్టు వద్ద ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇన్నోవా కారు పోలీసులకు కనిపించింది. దీంతో కారులోని సూరత్ వ్యక్తులను గట్టిగా నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. కొంతమంది దుండగులు నాలుగు కార్లలో వచ్చి, తమను అడ్డగించారని.. కిడ్నాప్ చేసి మూడు కోట్లు చోరీ చేశారని పోలీసులకు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇన్నోవా కారు సీటు కింద హవాలా డబ్బు దాచేందుకు ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అందులో ఉన్న కోటీ 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పెనుకొండ పోలీసులు.. మూడు కోట్లతో పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Latest News