|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:08 PM
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్‌కుమార్ దారుణ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇంకా బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నారని, అదే విషయాన్ని ఆమె లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసిందని తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి వెల్లడించారు. అత్యంత దారుణమైన ఈ కేసులో వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ ఆయన, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరిస్తున్నారని ఆ విద్యార్థిని ఫిర్యాదు చేసిన విషయాన్ని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ఆ వేధింపులకు తాళలేక, తీవ్ర మానసిక క్షోభకు గురై ఆమె చివరకు తన చదువు మధ్యలోనే వదిలేసిందని తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ తరహా ఘటన దురదృష్టకరమన్న తిరుపతి ఎంపీ, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, పూర్తి పారదర్శకంగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రిని కోరారు. వెంటనే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా బాధితురాలికి న్యాయం చేయడంలోనూ, ఆమె హక్కులు కాపాడడంలోనూ తగిన చొరవ చూపాలని జాతీయ మహిళా కమిషన్‌తో పాటు, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఆ బాధితురాలికి న్యాయం జరగడంతో పాటు, బాధ్యులకు తగిన శిక్ష పడేలా, ఈ అంశాన్ని తాము లోక్‌సభలో ప్రస్తావిస్తామని, ఆ మేరకు సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని ఎంపీ ఎం.గురుమూర్తి తెలిపారు.
Latest News