|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:08 PM
ప్రస్తుతం ఏపీలో బాబు- బీరు- సర్కారు.. పాలసీ అమలవుతోందని, చంద్రబాబు కనుసన్నల్లో మద్యం మాఫియా చెలరేగిపోతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలా తయారవుతున్న నకిలీ మద్యం.. రాష్ట్రంలో ఏరులైపారుతోందని వెల్లడించారు. నకిలీ మద్యం తయారీలో పాత్రధారులు, సూత్రధారులంతా అధికారపార్టీ నేతలేనని.. ములకల చెరువులో టీడీపీ తంబళ్లపల్లె ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే సాగిన నకిలీ మద్యం తయారీ ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో ఇంతవరకు జయచంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశాడన్న కక్షతోనే మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేశారని.. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యలేనని తేల్చి చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జరుగుతున్న వైయస్ఆర్‌సీపీ నేతల అక్రమ కేసులకు భయపడేదిలేదని, అక్రమ అరెస్టులకు సహకరిస్తున్న అధికారులకు వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్షఖాయమని స్పష్టం చేశారు.
Latest News