|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 10:35 PM
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.10 కోట్లతో ఎలమంచిలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. రెండేళ్ల కిందట పనులు ప్రారంభం కాగా.. ఏడాదిన్నర తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయాయి. తాజాగా మళ్లీ తిరిగి పనులను ప్రారంభించారు. ప్లాట్ ఫాం పనులను మధ్యలోనే నిలిపివేయటంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు ఎలమంచిలి రైల్వేస్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నెలరోజుల్లో ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు మళ్లీ ప్రారంభించారు. ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను దాదాపు 80 శాతం వరకూ పూర్తి చేశారు. అలాగే రైల్వే ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటుగా ప్రయాణికులకు తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు ఆధునికీకరిస్తున్నారు. ప్లాట్‌ఫాం పొడవునా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో ఒకటి, రెండు ప్లాట్‌ఫాంల మధ్యలో కొత్త ఫుట్ పాత్ వంతెన నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫాం పనులు పూర్తైన తర్వాత..మూడో నంబరు ప్లాట్‌ఫాం పనులను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఎలమంచిలి రైల్వే స్టేషన్ మీదుగా ఇప్పటికే ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. దీంతో పలు రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ కల్పించారు. అలాగే కొత్త రైళ్ల హాల్ట్‌కు కూడా ఆలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే అధికారుల వద్ద ఉన్నాయి. భువనేశ్వర్-బెంగళూర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో నిలపాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో స్టాపింగ్ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తంగా అభివృద్ధి పనులు పూర్తైన తర్వాత ఎలమంచిలి రైల్వేస్టేషన్ కొత్త రూపు సంతరించుకోవటంతో పాటుగా కొత్త రైళ్లకు హాల్ట్ కూడా ఇవ్వనుంది.
Latest News