|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:21 PM
దేశవ్యాప్తంగా నిర్వహించే లోక్ అదాలతో తేదీల్లో ఇటీవల తీవ్ర గందరగోళం తలెత్తుతోంది. కొన్ని చోట్ల ఈనెల 13వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మొదట ప్రకటన రాగా.. కొన్ని రాష్ట్రాలు అదేమీ లేదని కొట్టిపారేశాయి. లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి.. సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తడంతో.. ఆయా రాష్ట్రాలు క్లారిటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో మొదట ప్రకటించిన తేదీన కాకుండా.. లోక్ అదాలత్‌కు సంబంధించి సరికొత్త తేదీని ప్రకటించింది. ఇందులో ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తదుపరి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ తేదీని ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ (డీఎస్ఎల్ఎస్ఏ) మార్పు చేసింది. తమ కేసులను పరిష్కరించుకునేందుకు.. వాహనదారులు, పిటిషనర్లు సిద్ధం చేసుకోవడానికి మరింత సమయం లభించింది. నిజానికి డిసెంబర్ 13వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని కాస్తా.. ఇప్పుడు జనవరి 10వ తేదీన నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 13వ తేదీని సాధారణ పని దినంగా ప్రకటించడంతో.. జాతీయ లోక్ అదాలత్ తేదీని 2026 జనవరి 10వ తేదీకి మార్చారు.
ఈ లోక్ అదాలత్ సెషన్‌లు ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టులు, హైకోర్టు, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, వినియోగదారుల కమిషన్లలో ఏకకాలంలో జరగనున్నాయి. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ చాలా కీలకమైంది. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా నమోదైన కేసులను మాత్రమే ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తారు.
ఢిల్లీలోని టిస్ హజారీ, రోహిణి, ద్వారక, సాకేత్, పటియాలా హౌస్, కర్కర్డూమా, రౌస్ అవెన్యూ జిల్లా కోర్టులతో పాటు ఢిల్లీ హైకోర్టు, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, వినియోగదారుల కమిషన్లు, శాశ్వత లోక్ అదాలత్‌లలో కూడా ఈ లోక్ అదాలత్ సెషన్లు జరుగుతాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.
లోక్ అదాలత్‌లో పరిష్కరించే కేసులు
జంపింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల చలాన్లు, తప్పు నంబర్ ప్లేట్లు, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ ఉల్లంఘనలు వంటి కంపౌండబుల్ నేరాలను మాత్రమే ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్, యాక్సిడెంట్‌లకు సంబంధించిన తీవ్రమైన కేసులను సాధారణ కోర్టులే పరిష్కరిస్తాయి.
లోక్ అదాలత్‌కు హాజరయ్యే ముందు.. వాహన యజమానులు కొన్ని విషయాలను పాటించాల్సి ఉంటుంది. వాహనదారులు పరివాహన్ ఇ-చలాన్ పోర్టల్ లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్‌లో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఆ చలాన్లకు సంబంధించి జిరాక్స్ కాపీ, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వీటితోపాటు ఒక గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవడం అవసరం. కోర్టులో ఇప్పటికే కేసు పెండింగ్‌లో ఉన్నవారు.. జనవరి 10వ తేదీ సెషన్ కోసం ఆ కేసులను లిస్ట్ చేయమని సంబంధిత కోర్టు లేదా ట్రిబ్యునల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా కోర్టుకు చేరని కేసులను నేరుగా డీఎస్ఎల్ఎస్ఏకు సమర్పించవచ్చు.
Latest News