|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:30 PM
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఊహించలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వ్యక్తులు.. ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈమధ్య కాలంలో కార్డియాక్ అరెస్టుతో కొందరు ప్రాణాలు విడిస్తే.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఒకరు, చాప ముళ్లు ఇరుక్కుని మరికొందరు చనిపోయిన ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓ వ్యక్తి చనిపోయిన తీరు చూస్తే.. వార్ని ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఖర్జూరం తింటున్న వ్యక్తి ఉన్నట్లుండి కన్ను మూశాడు. అసలు విషయం తెలసుకున్న జనాలు.. వార్ని ఖర్జూరం ఎంత పని చేసిందని చర్చించుకుంటున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. స్నేహితుల కళ్లెదుటే.. రైలుకు ఎదురెళ్లి.. ఎంత ఘోరం చేశావ్ బ్రో..
ఖర్జూరం తింటున్న ఓ వ్యక్తి.. దాని గింజ గొంతులో ఇరుక్కుని కన్ను మూయడం స్థానికంగా కలకలం రేగింది. సత్య సాయి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి.. గతంలో ఫ్లెక్సీలు వేస్తూ జీవనం సాగించేవాడు. ఇప్పుడు కార్లు అద్దెకు తిప్పుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడు గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదిలా ఉండగా గురువారం రాత్రి క్రితం గంగాధర్ (46) తన ఇంట్లో కూర్చుని ఖర్జూరం తింటున్నాడు. ఇంతలో ఒక విత్తనం పొరపాటున అతడి గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో, ఊపిరాడక.. తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు తమ వల్ల కాదన్నారు.
వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే గంగాధర్ పరిస్థితి పూర్తిగా విషమించింది. ప్రైవేట్ డాక్టర్ల సూచన మేరకు గంగాధర్‌ని అనంతపురం తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే అతడి ప్రాణాలు పోయాయి. దాంతో వారింట విషాదం నెలకొంది. గంగాధర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఆరోగ్యం కోసం తిన్న ఖర్జూరం కాస్త అతడి ప్రాణాలు తీసింది అని చర్చించుకుంటున్నారు.
Latest News