|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:49 PM
జగన్ తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవాభావంతో ఓ వ్యక్తికి అందించిన రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని జగన్ వక్రీకరించి మాట్లాడటం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు. తానేంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నా. వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేసే అప్పన్న అనే వ్యక్తికి నేను సహాయం చేశాను. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన మాట్లాడేది సత్యమో కాదో దేవుడి ఎదుట ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. ప్రజల మధ్య తన గురించి తప్పుడు అభిప్రాయాలు సృష్టించేందుకే జగన్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.తాను ప్రతి నెలా ఎంతో మందికి సహాయం చేస్తుంటానని, సాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ కాదనలేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు.సేవ చేయడం కూడా ఒక్కోసారి తప్పయిపోతోంది. నిందలు మోయాల్సి వస్తోంది. మనం చేసే మంచేంటో ఆ దేవుడికే తెలుసు. జగన్ మాటలు బాధ కలిగించాయి కాబట్టే ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
Latest News