|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:02 PM
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్ని నాళ్లు దాచిన హృదయం.. ఎగసి ఎగసి పోతుంటే.. ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి.. అని పాడుకుని ఉంటారు ఆ నవదంపతులు. పెళ్లి అయితే అయింది, బంధుమిత్రులకు గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఇద్దామని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు అయిపోగా.. వారు తీరిగ్గా సమయానికి వెళ్లొచ్చని అనుకున్నారు. తీరా సమయానికి ఇండిగో విమాన సంస్థ చేసిన పని వారి ప్లాన్ బెడిసికొట్టింది.
హుబ్లీకి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరు నవంబర్ 23న భువనేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత డిసెంబర్ 4 బుధవారం నాడు హుబ్లీలో వధువు స్వస్థలంలో బంధువులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవ దంపతులు తమ రిసెప్షన్‌కు హాజరు అయ్యేందుకు డిసెంబర్ 2వ తేదీన భువనేశ్వర్ నుంచి బెంగళూరు మీదుగా హుబ్లీకి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న పైలట్ల కొరత, కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ ప్లానింగ్‌లో వైఫల్యం కారణంగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.
మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మొదలైన ఆలస్యం.. బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. చివరకు డిసెంబర్ 3వ తేదీన వారి విమానం రద్దు అయింది. భువనేశ్వర్-ముంబై-హుబ్లీ మార్గంలో ప్రయాణించాల్సిన వారి బంధువుల విమానాలు కూడా రద్దు కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు హుబ్లీలోని బంధువులు, స్నేహితులు రిసెప్షన్ కోసం ఎదురు చూస్తుండగా.. భువనేశ్వర్‌లో చిక్కుకుపోయిన వధూవరులు నిరాశ చెందకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి దుస్తుల్లో ముస్తాబై, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిసెప్షన్‌లో చేరారు. స్క్రీన్ పై తమ ప్రియమైన వారిని చూసి, వర్చువల్‌గా ఆశీస్సులు అందుకున్నారు.
ఇండిగో విమానాల ఆకస్మిక రద్దు కారణంగా ఈ వారం దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి తీవ్రతరం కావడంతో, ఇండిగో దేశీయ విమానాలను శుక్రవారం అర్ధరాత్రి వరకు దిల్లీ విమానాశ్రయం నిలిపివేసింది. టెర్మినల్స్‌లో అధిక రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అర్ధరాత్రిలోపు షెడ్యూల్ అయిన ఇండిగో ప్రయాణీకులు విమానాశ్రయానికి రాకుండా ఉండాలని అధికారులు కోరారు.
Latest News