|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:45 PM
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక ప్రకటన చేసింది. మరో రెండు కొత్త పథకాల్ని ఆఫర్ చేస్తోంది. వీటిల్లో ఎల్ఐసీ బీమా కవచ్- నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి. ఇది ప్యూర్ రిస్క్ కవరేజీ అందిస్తుంది. మరొకటి ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ స్కీమ్.. ఇది నాన్ పార్టిసిపేటింగ్, లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. ఈ రెండు ప్రొడక్ట్స్.. భారతదేశంలోని పౌరులు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇది ఎల్ఐసీ ఉత్పత్తుల శ్రేణిని మరింత మెరుగుపరుస్తుందని.. ఇంకా మార్కెట్ ఉనికిని మరింత విస్తరించి బలోపేతం చేస్తుందని ఎల్ఐసీ నమ్ముతోంది.
ఎల్ఐసీ బీమా కవచ్ ప్లాన్ విషయానికి వస్తే ఇది ఇండివిడ్యువల్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రధానంగా ఈ ప్లాన్ జీవిత బీమా రక్షణపైనే దృష్టి సారిస్తుంది. ఇక్కడ పాలసీదారు.. పాలసీ వ్యవధిలోనే మరణించినట్లయితే వారి కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుందని చెప్పొచ్చు. నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఇక్కడ బోనస్ వంటివి ఉండవు. అంటే మెచ్యూరిటీపై బోనస్ లభించదని చెప్పొచ్చు. ఇది మార్కెట్ లింక్డ్ కాదు కాబట్టి.. పెట్టుబడి నష్టభయాలు ఏం ఉండవని తెలుసుకోవాలి. ఈ ప్లాన్ గురించి పూర్తి సమాచారం.. డిసెంబర్ 3న స్కీమ్ లాంఛ్ అయిన తర్వాత తెలుస్తుందని చెప్పొచ్చు.
>> ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ అనేది ఒక సేవింగ్స్ ప్లాన్. ఇది నాన్ పార్టిసిపేటింగ్ స్కీమ్. అయితే బీమా కవచ్‌కు భిన్నంగా ఇది మార్కెట్ లింక్డ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే పెట్టుబడిపై నష్టభయం ఉంటుంది. అయితే ఇక్కడ జీవిత బీమా రక్షణ అందిస్తూ.. పొదుపు ప్రయోజనాల్ని కూడా కల్పిస్తోంది. రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట. వ్యక్తిగతంగా, అలాగే కుటుంబ పరంగా భద్రత, పెట్టుబడి సదుపాయాల్ని అందిస్తోంది.
అంతకుముందు కూడా ఎల్ఐసీ.. అక్టోబర్ నెలలో రెండు కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. అవి మహిళల కోసం ఉద్దేశించిన ఎల్ఐసీ బీమా లక్ష్మి ఒకటి కాగా.. మరొకటి ఎల్ఐసీ జన్ సురక్షా ప్లాన్. ఇవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రెండు కొత్త పథకాల గురించి పూర్తి సమాచారం కోసం ఇంకొక్క రోజు ఎదురుచూడాలి. ఎల్ఐసీ ఇటీవల జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 10,098 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 31 శాతం ఎక్కువ. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,26,930 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ షేర్ ధర మంగళవారం సెషన్‌లో స్వల్పంగా పెరిగి రూ. 883 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ. 5.59 లక్షల కోట్లుగా ఉంది.
Latest News