|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:42 PM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అమలులోకి రానుంది. ఇటీవలే వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసి విధివిధానాలు జారీ చేసింది. అయితే, అందులో పెన్షనర్లను విస్మరించారని, పెన్షన్ పునఃసమీక్షపై ఎలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెన్షన్ పెంపు అంశం గురించి గత వేతన సంఘాల మాదిరిగా పేర్కొనకపోవడంపై కేంద్రానికి లేఖ రాశాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. లక్షలాది మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లలో నెలకొన్న ప్రధాన ఆందోళనలను ఈ వివరణ ద్వారా తొలగించింది.
8వ వేతన సంఘం విధివిధానాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో పెన్షన్ పునఃసమీక్ష గురించి స్పష్టంగా ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత వేతన సంఘాల విధానంలో ఇది కీలక అంశం అయినప్పటికీ, ఈసారి దాన్ని విస్మరించడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది పెన్షన్ పునఃసమీక్షను 8వ వేతన సంఘం పరిధి నుంచి తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే భయాన్ని పెంచింది.
ఈ ఆందోళనలపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన వైఖరిని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ '8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్ వంటి వివిధ అంశాలపై తన సిఫార్సులను చేస్తుంది' అని తేల్చి చెప్పారు. దీంతో పెన్షన్ పునఃసమీక్ష అనేది గత వేతన సంఘాల మాదిరిగానే 8వ వేతన సంఘం పరిధిలో ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించినట్లయింది.
ఈ ప్రకటనతో 69 లక్షల మందికి పైగా పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది. ఉద్యోగుల సంఘాలు నవంబర్ నుంచి వ్యక్తం చేస్తున్న అతిపెద్ద ఆందోళనలలో ఒకదానికి ఈ వివరణతో తెరపడింది. ఎందుకంటే పెన్షన్ల పునఃసమీక్ష అనేది పాత, కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు రాకుండా సమతుల్యతను కాపాడటానికి చాలా ముఖ్యమైన అంశం.
డీఏ-డీఆర్ విలీనం
రాజ్యసభలో అడిగిన ప్రశ్నల్లో కరువు భత్యం, కరువు ఉపశమనంను తక్షణమే బేసిక్ పేలో విలీనం చేస్తారా అనే అంశంపైనా క్లారిటీ వచ్చింది. డీఏ 50 శాతం మార్కును దాటిన తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లు దీనిని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తూ, ప్రస్తుతం ఉన్న కరువు భత్యాన్ని బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదు అని తేల్చి చెప్పింది.
Latest News