|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:46 PM
ఇటీవల హర్యానా రవాణా శాఖ నిర్వహించిన వేలంలో ఓ ఫ్యాన్సీ నెంబర్‌కు రూ.1.17 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోనే ఖరీదైన ఫ్యాన్సీ నెంబరుగా 'HR 88 B8888' నిలిచింది. అయితే, ఈ నెంబరును దక్కించుకున్న ట్రాన్స్‌ఫోర్ట్ వ్యాపారి సుధీర్ కుమార్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయన ఆస్తులపై దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. సుధీర్ ఆదాయం, ఆస్తులపై లోతైన విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ ఈ మేరకు హర్యానా రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
మంత్రి అనిల్ విజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వీఐపీ నెంబరు ప్లేట్లకు మేము వేలం నిర్వహిస్తుంటాం.. చాలా మంది ‘8888’ కోసం బిడ్ వేశారు.. అయితే అత్యధిక బిడ్ వేసి వేలంలో నెంబరు దక్కించుకున్న తర్వాత, బిడ్డర్ (సుధీర్ కుమార్) ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీనికి బదులు రూ. 11,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు’ అని అన్నారు. ఫ్యాన్సీ నంబర్‌కు బిడ్డింగ్ వేసిన రూ. 1.17 కోట్లు నికర ఆస్తి ఉందా? లేదా? అనే విషయాన్ని దర్యాప్తు చేయాలని కోరినట్టు తెలిపారు.
అంతేకాదు, ఈ విషయంపై విచారణ కోరుతూ ఆదాయపన్ను శాఖకు తాను లేఖ రాయబోతున్నానని మంత్రి చెప్పారు. ఆర్థిక స్థోమత లేకపోతే ఫ్యాన్సీ నెంబరు వేలంలో పాల్గొనకుండా నిరోధించడానికే ఈ చర్య అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేలం బిడ్ వేయడం ఒక వినోదం కాదు, అది బాధ్యత’ అని మంత్రి అనిల్ విజ్ తేల్చిచెప్పారు. ఫ్యాన్సీ నెంబరుకు తిరిగి వేలం నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. కాగా, రెెండేళ్ల కిందట దుబాయ్‌కు చెందిన ఓ వ్యాాపారవేత్త ఫ్యాన్సీ నెంబరు కోసం 55 మిలియన్ దిర్హామ్‌లు (అంటే భారత కరెన్సీలో రూ.122 కోట్లు)కు దక్కించుకున్న వార్త అంతర్జాతీయంగా వైరల్ అయ్యింది.
నవంబరు 26న నిర్వహించిన వేలంలో ' HR88B8888 ' ఫ్యాన్సీ నెంబరు వార్తల్లో నిలిచింది. ఏకంగా రూ.1.17 కోట్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. మొత్తం 45 మంది ఈ నెంబరు కోసం పోటీపడగా.. ప్రారంభ ధర రూ.50 వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. అయితే, సుధీర్ కుమార్ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు రాలేదు. అతడు మీడియాతో మాట్లాడుతూ.. శనివారం రాత్రి రెండుసార్లు బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించాను కానీ సాంకేతిక లోపం కారణంగా విఫలమయ్యానని చెప్పాడు. అంతేకాదు, ఫ్యాన్సీ నెంబరు కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం పట్ల తన కుటుంబం వ్యతిరేకిస్తుందని కూడా వివరించాడు.