మునీర్ తీవ్రవాది.. భారత్‌తో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు.. ఇమ్రాన్ సోదరి
 

by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:49 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిల్లో ఒకరైన అలీమా ఖాన్.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధానికి ఆసీం మునీర్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటే. తన సోదరుడు ఇమ్రాన్ మాత్రం పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నించాడని అన్నారు. మునీర్ ఓ ఇస్లామిక్ తీవ్రవాది అని, ముస్లిం సంప్రదాయవాది అని అలీమా దుయ్యబట్టారు. స్కై న్యూస్‌లో ‘ది వరల్డ్ విత్ యల్డా హకీమ్’ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏంటి అన్న ప్రశ్నకు.. మునీర్ అని ఆమె సమాధానం ఇచ్చారు.


‘‘పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మత తీవ్రవాదానికి ప్రభావితమైన ఓ ఇస్లామిస్ట్.. ఇస్లామిక్ పరంపరవాది. ఇదే కారణం వల్ల పొరుగు దేశంతో యుద్ధం చేయాలన్న ఆత్రుత ఉంటుంది. అతడి ఇస్లామిక్ తీవ్రవాద భావాలు, సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారితో పోరాడాలని ప్రేరేపిస్తాయి’’ అని అలీమా ఖాన్ ధ్వజమెత్తారు. ఇక తన సోదరుడు ఇమ్రాన్‌ను స్వచ్ఛమైన స్వేచ్ఛావాదిగా ఆమె అభివర్ణించారు. ‘‘ ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే భారత్, అలాగే బీజేపీతోనూ స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు.. కానీ, ఈ ఇస్లామిక్ తీవ్రవాది ఆసీం మునీర్ పదవిలో ఉంటే భారత్‌తో యుద్ధం తప్పదు... భారత్ మాత్రమే కాదు, దాని మిత్రదేశాలు కూడా దాని ప్రభావాలను అనుభవించాల్సి వస్తుంది’’ అని ఆమె ఆరోపించారు. తన సోదరుడు ఇమ్రాన్ గొప్ప ఆస్తి అని, అతడ్ని జైలు నుంచి విడిపించడానికి పశ్చిమ దేశాలు మరింత ప్రయత్నించాలని అలీమా విజ్ఞప్తి చేశారు.


ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ వద్ద పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి తెగబడి 26 మంది అమాయకుల ప్రాణాలను తీశారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి.


మునీర్ vs ఇమ్రాన్ ఖాన్


2018 పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా తెహ్రీక్ ఇన్సాఫ్ అవతరించడంతో కూటమి కట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని చేపట్టారు. ఈ సమయంలో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, ఆమె సర్కిల్ చుట్టూ వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు ఐఎస్ఐ డీజీగా ఉన్న జనరల్ అసిమ్ మునీర్ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. ఇది ఇమ్రాన్‌కు నచ్చలేదని, తరువాత మునీర్‌ను ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి తప్పించారని సమాచారం. దీనిపై సైన్యం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో మూడేళ్లు పదవిలో ఉండాల్సిన మునీర్ ఎనిమిది నెలల్లోనే తప్పుకోవాల్సి వచ్చింది.


అప్పటి నుంచి ఇమ్రాన్‌పై అసిమ్ మునీర్ ప్రతీకారంతో రగిలిపోయి సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 2023లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. చివరకు పలు అవినీతి ఆరోపణల కేసుల్లో అరెస్టై 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. కానీ, ఇటీవల ఇమ్రాన్ ఆరోగ్యంపై వదంతులు కలకలం రేపాయి. తమ కలవడానికి అనుమతించడం లేదంటూ ఇమ్రాన్ కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆయన క్షేమంగా ఉన్నారా? అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలిసారి అఫ్గనిస్థాన్ సోషల్ మీడియాలో ఇమ్రాన్ మరణం గురించి వార్తలు వైరల్ అయ్యాయి. పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ ర్యాలీలు చేపట్టారు. చివరకు మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి డాక్టర్ ఉజ్మాన్ ఖానుమ్ కలవడంతో వదంతులకు తెరపడింది.

Latest News
Hollow promises for farmers' compensation exposed, says Shiv Sena(UBT) in Saamana Fri, Dec 05, 2025, 11:36 AM
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM