|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:32 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాలలోని రహదారులపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అలాగే పీపీపీ పద్ధతిలో గ్రామీణ రహదారులను అభివృధ్ది చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లావాసులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ప్రొద్దుటూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రొద్దుటూరు మీదుగా వెళ్లే మైపాడు- నెల్లూరు- బళ్లారి- బాంబే జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలంగా స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ రహదారి విస్తరణకు నోచకపోవడంతో దీని మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైదుకూరు రోడ్డు నుంచి బొల్లవరం వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
నిధులు మంజూరైన నేపథ్యంలో రహదారి పనుల కోసం ఇటీవల టెండర్లు కూడా జారీ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు అధికారులు నిర్ణయించిన ప్రకారం ప్రొద్దుటూరులోని మైదుకూరు రహదారిని 4 వరుసలుగా విస్తరిస్తారు. ఏడు మీటర్లు చొప్పున వెడల్పు చేస్తారు, మధ్యలో డివైడర్లు, రెండు వైపులా వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. వైవీఎస్ బాలికల హైస్కూల్ నుంచి బొల్లవరం రోడ్డులో కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తారు.
మరోవైపు ప్రొద్దుటూరు పట్టణం బంగారు పురిగా ప్రసిద్ధి..వాణిజ్య కేంద్రంగా పేరొందింది. అయితే జనాభా పెరుగుతున్నప్పటికీ.. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ చాలాచోట్ల ఇరుకు రహదారులే కనిపిస్తాయి. ఏళ్ల తరబడిగా రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు. దీంతో వాహనాల రద్దీతో పాటుగా.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో మార్పు వచ్చింది. అధికారులు రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో వాహనాల రద్దీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
Latest News