|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:32 PM
చియా సీడ్స్‌లో ఫైబర్‌తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలతో ఇవి సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఇటీవలి కాలంలో చియా విత్తనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది రోజూ వీటిని తీసుకుంటున్నారు. అయితే వీటిని ఎంత పరిమాణంలో, ఏ విధంగా తీసుకోవాలి అనే విషయంలో నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.సూపర్‌ఫుడ్‌గా పేరు తెచ్చుకున్న చియా సీడ్స్‌ను సాల్వియా హిస్పానియా అనే మొక్క నుండి తీసుకుంటారు. సాధారణంగా వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. అయితే పాలలో నానబెట్టుకుని తింటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన చియా సీడ్స్ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. చియా గింజలు నీటిని ఎక్కువగా షోషించుకునేవి కావడం వల్ల, వీటిని తిన్నాక మంచి నీరు తాగడం తప్పనిసరి. లేనిపక్షంలో నిర్జలీకరణ సమస్య రావచ్చు. మొదటిసారి తీసుకునేవారు తక్కువ పరిమాణంతో మొదలుపెట్టడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు 1–2 చెంచాల (టేబుల్ స్పూన్లు) మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. చల్లదన గుణం ఉండటం వల్ల కడుపు చల్లగా ఉంచడంలో, అలాగే శరీరంలో హైడ్రేషన్ మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.చియా సీడ్స్‌లో ఫైబర్ అధికమై ఉండటం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచి, హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి పాత్ర వహిస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు మరియు డయాబెటిస్‌పై నియంత్రణకు కూడా ఇవి సహాయకారిగా పనిచేస్తాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా రాకుండా చేసి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయి. అదనంగా, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.అయితే చియా విత్తనాలను ఎక్కువగా తింటే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. వీటికి అలెర్జీ ఉన్నవారు పూర్తిగా దూరంగా ఉండాలి.రక్తపోటు, మధుమేహ రోగులు వైద్యుని సలహా లేకుండా చియా విత్తనాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానబెట్టకుండా తినడం గొంతులో ఇరుక్కునే ప్రమాదం కలిగిస్తుంది. బీపీ మందులు తీసుకునేవారిలో చియా ఎక్కువగా తీసుకుంటే పొటాషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగి హైపర్‌కలీమియా వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక ఒమేగా-3 ఉండటం వల్ల వార్ఫరిన్, ఆస్పిరిన్ వంటి బ్లడ్ థిన్నర్స్ వాడేవారికి బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది.పెద్దవారు రోజుకు 15–25 గ్రాములు (1–2 టేబుల్ స్పూన్లు) మాత్రమే తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News