|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:32 PM
చైనాలో జననాల రేటు గణనీయంగా పడిపోతుండటంతో ప్రభుత్వం ఇప్పుడు అసాధారణ నిర్ణయం తీసుకుంది. దేశంలో జనాభా క్షీణతను అరికట్టేందుకు గర్భనిరోధక సామగ్రిపై పన్ను విధిస్తూ హుటాహుటిన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, ఇతర పరికరాలపై 13 శాతం వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) విధించనుంది. ఈ నిర్ణయం వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమలులోకి రానుంది.
1993 నుంచి చైనాలో కండోమ్‌లు సహా గర్భనిరోధక ఉత్పత్తులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉండేది. ఒకప్పటి ‘ఒక బిడ్డ’ విధానం కారణంగా జనాభా నియంత్రణ కోసం ప్రోత్సహించిన ఈ మినహాయింపును ఇప్పుడు పూర్తిగా తొలగిస్తున్నారు. దీని ద్వారా గర్భనిరోధకాల ధరలు పెరిగి వినియోగం తగ్గుతుందని, దానివల్ల గర్భధారణలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య ద్వారా జనాభా పెంపు లక్ష్యాన్ని సాధించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.
అదే సమయంలో పిల్లల్ని కనే దంపతులకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు పలు రాయితీలు ప్రకటించింది చైనా ప్రభుత్వం. పిల్లల సంరక్షణ సేవలు, డెలివరీ ఖర్చులు, వివాహ సంబంధిత సేవలు, బేబీ ప్రొడక్ట్స్‌పై ఉన్న VATను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించి, ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రేరేపించడమే ఈ విధానం లక్ష్యం.
చైనా జనాభా రేటు గత దశాబ్ద కాలంగా దిగొచ్చిన నేపథ్యంలో ఈ రెండు వైపులా చర్యలు తీసుకుంటూ దేశం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. కండోమ్‌పై పన్ను విధించడం ద్వారా “కావాల్సినన్ని పిల్లలు” అనే సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వినూత్న విధానం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.