|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:30 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. అమరావతిని అధికారికంగా, చట్టబద్ధంగా ఏకైక రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సవరణలు చేపట్టే బిల్లును పార్లమెంటులో తీసుకురానున్నారు. ఈ సవరణ ద్వారా అమరావతి పేరును స్పష్టంగా రాజధానిగా చేరుస్తారని తెలుస్తోంది.
ప్రత్యేకంగా సెక్షన్ 5(2)లో మార్పులు చేయడమే ఈ బిల్లు లక్ష్యం. ఇప్పటివరకు ఈ సెక్షన్ అస్పష్టతకు కారణమై, మూడు రాజధానుల ఆలోచనకు ఆస్కారం ఇచ్చింది. ఇకపై ఆ అవకాశం పూర్తిగా మూసివేయబడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర న్యాయ శాఖ ఈ సవరణ బిల్లుకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు సమాచారం.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం లభించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. దీంతో అమరావతి రాజధాని హోదా చట్టబద్ధంగా స్థిరపడిపోతుంది.
ఈ పరిణామంతో ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. రైతులు, ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న న్యాయం అందబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.